24 April, 2026 | 1:51 AM

పర్యావరణానికి అనుకూలమైన వ్యవసాయ పద్ధతులు పాటించేలా ప్రోత్సహించాలి

24-04-2026 12:00 AM

కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 23 ( విజయక్రాంతి ): రైతులకు అధిక దిగుబడి, లాభదాయక వంగడాల అభివృద్ధి ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం లో గురువారం నిర్వహించిన దక్షిణ తెలంగా ణ వ్యవసాయ పరిశోధనవిస్తరణ సలహా సంఘ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ రైతుల సమస్యలకు సమయానుకూల పరిష్కారాలు కనుగొనాలని కలెక్టర్ సూచించారు. ఆధునిక సాంకేతికత వినియోగంతో మానవ శ్రమ తగ్గించి, పర్యావరణానికి అనుకూలమైన వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని కోరారు. వాతావరణ మార్పుల ను దృష్టిలో ఉంచుకుని వాటిని తట్టుకునే పంటలు, లాభదాయక వంగడాల అభివృద్ధిపై దృష్టి సారించాలని తెలిపారు.

ప్రాంతీ య వ్యవసాయ పరిశోధన కేంద్రం సంచాలకులు డా. ఎల్. కృష్ణ మాట్లాడుతూ దక్షిణ తెలంగాణ వ్యవసాయ అభివృద్ధిలో కేంద్రం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. గత ఏడాది వరి, వేరుశనగ, సెనగ పంటల్లో సాధించిన పురోగతిని వివరించారు. ముఖ్యంగా వరి పంటలో ఆర్‌ఎన్‌ఆర్ 25105, 31479 వంటి అధిక దిగుబడి, తక్కువ నూకశాతం కలిగిన వంగడాలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకులు డా. బలరాం మాట్లాడుతూ చలి, ఎండలను తట్టుకునే పంట రకాల అభివృద్ధి, వరికి ప్రత్యామ్నాయ పంటల విస్తరణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, పంపిణీలో విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని వివరించారు.సమావేశంలో సమగ్ర వ్యవసాయం, భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి పద్ధతుల అమలు, చిరుధాన్యాల ప్రోత్సాహం వంటి అంశాలపై చర్చించారు.

డిజిటల్ వ్యవసాయం ప్రాధాన్యతను గుర్తుచేస్తూ రైతులకు సామాజిక మాధ్యమాల ద్వారా సత్వర సమాచారం అందించాలని సూచించారు.ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొని 202627 వ్యవసాయ ప్రణాళికపై సూచనలు అందించారు. రైతుల ఆదాయం పెంపులో మెరుగైన వంగడాల అభివృద్ధి కీలకమని వక్తలు అభిప్రాయపడ్డారు.