స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతినిత్యం స్మరించుకోవాలి
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్, మార్చి 23 (విజయ క్రాంతి): మన దేశ స్వాతంత్రం కోసం పోరాడి తమ ప్రాణాలను సైతం నవ్వుతూ వదులుకున్న ఎందరో మహనీయుల త్యాగాలను భారతీయులందరూ నిత్యం స్మరించుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. మార్చ్ 23 నవ యువకులైన దేశభక్తులు భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ ల ప్రాణత్యాగానికి గుర్తుగా సమర్పణ దివస్ కార్యక్రమాన్ని కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం పాలిటెక్నిక్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కులాలు, మతాలు ప్రాంతాలు వేరువేరుగా ఉన్నప్పటికీ భారతీయులందరూ ఒకే తల్లి బిడ్డల్లాగా కలిసి ఉండటమే మన స్వతంత్ర సమరయోధుల యొక్క జీవిత ఆశయమని గుర్తు చేశారు, ప్రాణ త్యాగానికి మించిన గొప్ప త్యాగం ఇంకేది ఉండదని అలాంటిది వేలాదిమంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను ఈ దేశం కోసం వదిలిపెట్టారని ఆయన తెలిపారు.
నవ యువకులుగా ఉన్న అతిపిన్న వయసు గల యువకులు భగత్ సింగ్ అతని స్నేహితులు రాజ్ గురు, సుఖదేవ్ ఉరి తాడు ను సైతం నవ్వుతూ ముద్దాడి మెడలో వేసుకున్నారని తమ చివరి కోరిక ఏమిటి అంటే భారతమాతకు జై అని కలిసి నినదించాలని అన్నట్టుగా మనకు చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయన్నారు. ఇటువంటి మహనీయుల స్ఫూర్తిగాతలను మనందరం తప్పకుండా చదవాలని దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవాలని ఆయన సూచించారు.
జిల్లా యువజన అధికారిని శైలి బెల్లాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యువత కోసం ఎన్నో విశేషమైన కార్యక్రమాలను రూపొందిస్తున్నదని అందులో భాగంగానే జాతీయ స్థాయిలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని అందులో యువతీ యువకులందరూ ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. వారి వారి షెడ్యూల్ లో కూడా తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలీస్ కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి గౌరవంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అనురాధ, కళాశాల సిబ్బంది, యువతి యువకులు పాల్గొన్నారు.




