బంగ్లాతో సత్సంబంధాలు కోరుకుంటున్నాం
* మైనార్టీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాం
* భారత విదేశాంగ కార్యదర్శి
* ఇస్కాన్ చిన్మయ్‌పై మరో కేసు
ఢాకా, డిసెంబర్ 9: బంగ్లాదేశతో సానుకూల సంబంధాలను భారత్ కోరుకుంటోం దని, యూనస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఎదురు చూస్తున్నట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి తెలిపారు. బంగ్లాలో ఇటీవల జరిగిన పరిణామాలతో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలు తలెత్తడంతో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ బంగ్లాకు వెళ్లారు. బంగ్లా విదేశాంగ కార్యదర్శి మహమ్మద్ జషీముద్దీన్, విదేశాంగ సలహాదరు తౌహిద్ హుస్సేన్‌తో ఆయన భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు. బంగ్లాలో హిందువులు, మైనార్టీల భద్రతపై ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆయన వెల్లడించా రు. అలాగే ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్‌పై కూడా చర్చించినట్లు తెలిపారు. భారత సరిహద్దులో బేరక్తర్ డ్రోన్లను మోహరించడం పైనా మాట్లాడినట్లు పేర్కొన్నారు.
చిన్మయ్‌పై మరోకేసు..
ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్‌పై బంగ్లాలో మరో కేసు నమోదు చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. చిట్టగాంగ్ కోర్టు వద్ద చిన్మయ్ మద్దతుదారులు, పోలీసులకు మధ్య గొడవ జరగడంతో కృష్ణదాస్‌తో సహా 164 మందిపై దేశద్రోహం కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అలాగే మరో 400 నుంచి 500 మంది గుర్తుతెలియని వ్యక్తులపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.






