13 August, 2026 | 3:48 AM

సర్పంచ్‌ల హక్కుల కోసం ఉద్యమిస్తాం

13-08-2026 01:17 AM

ఉమ్మడి పాలమూరు జిల్లా సర్పంచుల చైతన్య సదస్సు సన్నాహక 

సమావేశంలో నేతల వెల్లడి

వనపర్తి, ఆగస్టు 12 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీలకు నిధులు, అధికారాలు కల్పించడంతో పాటు సర్పంచుల హక్కులను పరిరక్షించేందుకు ఐక్యంగా పోరాడతామని తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ నాయకులు అన్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లా సర్పంచుల చైతన్య సదస్సు సన్నాహక సమావేశం సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి మందిపల్లి వెంకట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాదేపల్లి సిద్ధార్థ, రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి లు మాట్లాడారు. గ్రామస్థాయిలో ప్రజలచే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచులకు సరైన నిధులు, అధికారాలు లేకుండా పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

సర్పంచులు ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి గెలిచినప్పటికీ గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు అందక ప్రజలకు జవాబుదారీగా పనిచేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీ రాజ్ సంస్థలకు సంక్రమించిన 29 అధికారాలను గ్రామ పంచాయతీలకు పూర్తిస్థాయిలో బదలాయించాలని వారు డిమాండ్ చేశారు. పంచాయతీలకు రావాల్సిన నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకే అందించాలని, వివిధ పేర్లతో ఇతర మార్గాల్లో నిధుల వినియోగం జరగకుండా చూడాలని వారు కోరారు.

తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని, కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో రోడ్లు, సొంత పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు వంటి మౌలిక వసతులను వెంటనే కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు విషయంలోనూ ప్రభుత్వం స్పష్టమైన విధానం తీసుకురావాలన్నారు. సర్పంచ్ ఎన్నికైన తర్వాత సర్పంచ్ను కమిటీకి చైర్మన్గా నియమించి గ్రామస్థాయి అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని వారు సూచించారు.

సర్పంచులను కేవలం సంతకాలకు పరిమితం చేసి, పెత్తనం ఇతరుల చేతుల్లో పెట్టడం సరికాదన్నారు.గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని, 16వ ఆర్థిక సంఘం నిధులను గ్రామాల అభివృద్ధికి వినియోగించాలని వారు డిమాండ్ చేశారు. కొత్త పంచాయతీల్లో కనీస మౌలిక వసతులు కూడా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సర్పంచులకు నిధులు, అధికారాలు ఇవ్వకుండా గ్రామాలను ఎలా అభివృద్ధి చేయాలి? అని వారు ప్రశ్నించారు.

పార్టీలకు అతీతంగా సర్పంచుల హక్కుల కోసం పంచాయతీ రాజ్ ఛాంబర్ పోరాడుతోందని, ప్రభుత్వం సర్పంచుల సమస్యలపై స్పందించకపోతే తెలంగాణలో మరో ఉద్యమం తప్పదని వారు హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నామని, ఉమ్మడి పాలమూరు జిల్లా సర్పంచులను పెద్ద సంఖ్యలో సమీకరించి వారి సమస్యలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో ఆయా మండలాల అధ్యక్షులు సర్పంచులు పాల్గొన్నారు