నిరుపేదలకు ఇండ్లు కట్టించి తీరుతాం

29-04-2024 12:04:41 AM

l రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు 

వనపర్తి, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): రాష్ట్రంలోని నిరుపేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు కట్టించి తీరుతుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని చిన్నమారూర్, వెల్టూర్, చెల్లేపాడు, అయ్యవారిపల్లి, కొప్పునూర్ గ్రామాల్లో ఆదివారం ఆయన కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో కొందరు డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరగా మంత్రి స్పందించారు. గతంలో తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను కట్టించి ఇచ్చిందని, అదే విధంగా ఇప్పుడు కూడా ఇండ్లు కట్టిస్తామనిన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తానే స్వయంగా వచ్చి లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు చేస్తానని భరోసానిచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని గెలిపించాలని గ్రామస్తులను కోరారు. అనంతరం మంత్రి వెల్టూర్ గ్రామానికి వెళ్లి కేఎంఆర్ ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ నేత కల్యాణ్ రూ.18 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన రెండు బోర్లను ప్రారంభించారు.