కేంద్రమంత్రి రాజీనామా చేసేంతవరకు ఆందోళన కార్యక్రమాలు చేస్తాం
బెజ్జూర్, జులై 23 (విజయక్రాంతి): నీట్ పేపర్ లీకేజీ కి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సత్వరమే రాజీనామా చేయాలని ఆయన రాజీనామా చేసేంతవరకు తమ ఉద్యమం ఆపేది లేదంటూ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు.
బెజ్జుర్ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జంతర్మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులు, యువకుల పైన లాఠీ చార్జీ చేయడం ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నం అని వారు పేర్కొన్నారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే బిజెపి నాయకులు చొరబడి హింసను ప్రేరేపించారు అన్నారు.విద్యార్థుల చదువులకు భరోసా ఇవ్వని ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన తీర్మానం ప్రకారం ఉభయ సభల్లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా లాటి చార్జి చేయడం భారతదేశపు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని విద్యాశాఖ తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు ఆగవని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ గణపతి, జిల్లా ఉపాధ్యక్షులు కోండ్ర జగ్గ గౌడ్, సిర్పూర్ నియోజకవర్గం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాచకొండ శ్రీ వర్ధన్, సర్పంచులు కొండ రాంప్రసాద్, సోయం చిన్నయ్య, మల్లేష్, శ్రీ హరి, చిరంజీవి, కడప శంకర్, ఉప సర్పంచ్ ఆదర్శ్, నాయకులు భూష శంకర్, సామల రాజన్న, రామకృష్ణ, బాబురావు, విశ్వేశ్వర్, పెంటయ్య, నాహిరల్లీ, చండె శంకర్,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.






