calender_icon.png 3 February, 2026 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆమనగల్‌ను 'మోడల్ మున్సిపాలిటీ'గా తీర్చిదిద్దుతా..

03-02-2026 09:42:25 PM

* ఎమ్మెల్యే కసిరెడ్డి హామీ

​కాంగ్రెస్ గెలిస్తే రూ.100 కోట్లతో అభివృద్ధి.. 

* బీఆర్ఎస్, బీజేపీలపై నిప్పులు

​ఆమనగల్,(విజయక్రాంతి): గత ప్రభుత్వాల అసమర్థత వల్లే ఆమనగల్ పట్టణం దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి విమర్శించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో రూ.100 కోట్ల ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఆమనగల్‌ను ఆదర్శ మున్సిపాలిటీగా మారుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.​

మంగళవారం స్థానిక శ్రీలక్ష్మి గార్డెన్‌లో ఎన్నికల ఇన్చార్జి శ్రీనివాస్ గౌడ్, వార్డుల ఇన్చార్జిలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ​గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆమనగల్ మున్సిపాలిటీ వెనుకబాటుకు గురైంది అన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు కేవలం రాజకీయ స్వార్థం కోసమే పాకులాడాయి తప్ప, ఆమనగల్ అభివృద్ధిని గాలికొదిలేశాయని దుయ్యబట్టారు.

వారి పాలనలో ప్రజలకు కనీస మౌలిక వసతులు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి కల్వకుర్తి, ఆమనగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టానని.. ఇప్పటికే ఆమనగల్ మున్సిపాలిటీకి రూ. 63 కోట్ల నిధులు మంజూరు చేయించానని గుర్తు చేశారు. ​ప్రస్తుతం పట్టణంలో మున్సిపల్ నూతన భవనం, ప్రభుత్వ దవాఖాన, బీసీ వసతి గృహాల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పలు లబ్ధిదారులకు 360 పైగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశానని త్వరలోనే మరో 300 కి పైగా ఇండ్లను కేటాయిస్తానని ఆయన చెప్పారు.

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యను పరిష్కరించామని, వచ్చే ఏడాది కల్లా విద్యార్థులకు నూతన భవనంలో తరగతులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. షాద్నగర్, దేవరకొండ  ప్రధాన రోడ్ల విస్తరణకు కృషి చేసినట్లు చెప్పారు.  నాలుగు మండలాల ప్రజలు, ​పట్టణ ప్రజల సౌకర్యార్థం ఆర్డీవో (RDO), ఏసీపీ (ACP) కార్యాలయాలతో పాటు చిరు వ్యాపారుల కోసం ప్రత్యేక కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

​"మన ప్రాంత బిడ్డ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గంపై ప్రత్యేక ప్రేమతో ఉన్నారు. ప్రస్తుతం ఓట్ల కోసం వచ్చే ప్రతిపక్షాలను అభివృద్ధి ఎక్కడ అని నిలదీయండి. ఆమనగల్ సర్వతోముఖాభివృద్ధికి కాంగ్రెస్‌ను ఆశీర్వదించండి అని ఎమ్మెల్యే కోరారు.​మున్సిపాలిటీలోని 15 వార్డుల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.