5 June, 2026 | 1:10 AM

తాగునీటి సమస్య లేకుండా చూస్తాం

05-06-2026 12:00 AM

ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్, జూన్ 4 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భవిష్యత్ తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా పక్కా ప్రణాళికలతో చర్యలు తీసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ స్పష్టం చేశారు.

నియోజకవర్గంలోని తాగునీటి సరఫరా పరిస్థితులపై ఆయన తన క్యాంపు కార్యాలయంలో జలమండలి ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశాన్ని గురువారం నిర్వహించారు. నియోజకవర్గ మ్యాప్ను పరిశీలిస్తూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న రిజర్వాయర్ల స్థానాలు, వాటి నీటి నిల్వ సామర్థ్యం, ప్రస్తుత సరఫరా విధానం, వివిధ ప్రాంతాల ప్రజల అవసరాలపై అధికారులతో పూర్తిస్థాయిలో చర్చించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్ జనాభా అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గంలో మరిన్ని కొత్త రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టాలన్నారు. అందుకోసం అవసరమైన స్థలాల సేకరణ, నీటి నిల్వ సామర్థ్యం పెంపు, బడ్జెట్ అంచనాలు, సిబ్బంది నియామకం వంటి కీలక అంశాలపై తక్షణమే సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని 12 డివిజన్ల ప్రజలకు ప్రతిరోజూ ఉదయం 10 గంటలలోపే తాగునీరు అందేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని సూచించారు. భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసి, తగిన చర్యలు చేపట్టాలని జలమండలి అధికారులకు దిశానిర్దేశం చేశారు.