ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపడతాం
జిల్లా కలెక్టర్ కె.హరిత
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని అధికారుల సమన్వయంతో పకడ్బందీగా చేపడతామని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. గురువారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్ రావు తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం జిల్లా ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులకు ఈ నెల 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, బూత్ స్థాయి అధికారులు తమ పరిధిలోని ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారం అందించి ధ్రువపత్రాలు జతచేసిన ఫారాన్ని తిరిగి తీసుకొని బి.ఎల్.ఓ. యాప్ లో వివరాలు నమోదు చేయాలని తెలిపారు.
ఇప్పటికే రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించడం జరిగిందని, రాజకీయ పార్టీల తరఫున బూత్ స్థాయి ఏజెంట్ల జాబితాను తీసుకోవడం జరిగిందని తెలిపారు. సిర్పూర్ నియోజకవర్గంలో 320 పోలింగ్ కేంద్రాలు, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 358 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఈ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో చేపట్టి ఎలాంటి పొరపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు జమీల్, నాయబ్ తహసిల్దార్ శ్యాం లాల్, రామ్ లాల్, సిబ్బంది పాల్గొన్నారు.






