calender_icon.png 14 January, 2026 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవితను కాంగ్రెస్‌లో చేర్చుకోం

14-01-2026 02:44:38 AM

  1. బీఆర్‌ఎస్ పని అయిపోయింది  

తెలంగాణ నీటి వాటాలో రాజీపడేదిలేదు

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ 

హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్‌ఎస్ పార్టీ పని అయిపోయిందని, ఆ పార్టీకి గతం తప్ప భవిష్యత్తు లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్సీ కవిత చేసే వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ పార్టీ దగ్గరే సమాధానం లేదని, దీనిని బట్టే ఆ పార్టీలో అంతర్గత గందరగోళం అర్థమవుతోందని విమర్శించారు. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లుగా ప్రజలు బలంగా నమ్ముతున్నారని, అందుకే ఆ పార్టీని అంతా దూరం పెడుతున్నారని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.

కవితను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే ఆలోచన లేదన్నారు. ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ర్టంలోనూ లేవని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా తమ ‘ప్రజా ప్రభుత్వం’ ముందుకు వెళ్తోందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నుంచి రెబల్స్ లేకుండా పకడ్బందీగా వ్యవహరిస్తామని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నియోజకవర్గాల్లో పాత నాయకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామన్నారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన జిల్లాల విభజన అశాస్త్రీయంగా ఉందని, ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో ఏ ఒక్క జిల్లాను కూడా తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. జిల్లా పునర్విభజనపై ప్రత్యేకంగా కమిటీ వేసి జిల్లాల సరిహద్దులు, విభజనపై శాస్త్రీయంగా మార్పులు చేర్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి  భావిస్తున్నారని వెల్లడించారు. సీఎం మంత్రుల శాఖల్లో జోక్యం చేసుకోరని మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్ధించారు.

పాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో భాగంగా హైదరాబాద్ బయట కేబినెట్ మీటింగ్ పెట్టడం శుభ పరిణామమన్నారు. భూభారతిలో అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉంటే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. త్వరలోనే కార్పొరేషన్ చైర్మన్ల పదవులను భర్తీ చేస్తామని, డిమాండ్ అధికంగా ఉన్నందున వడపోత జరుగుతోందని తెలిపారు. ఇక చివరగా తెలంగాణ నీటి వాటా విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు.