14-01-2026 02:46:16 AM
పాలకులు మారితే పథకాల పేర్లు మారుతాయి
కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, జనవరి 13 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీ-జీ రామ్ జీ పథకం అద్భుతమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొనియాడారు. మంగళవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా గ్రామానికి స్థిర ఆస్తులను సృష్టించడంతోపాటు ప్రతి ఒక్కరికి కచ్చితంగా 125 రోజుల పని దొరుకుతుందన్నారు.
వ్యవసాయ సీజన్‌లో కూలీలు దొరకక ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ పథకం ద్వారా ఉపశమనం కల్పించబోతోందన్నారు. గతంతో పోలిస్తే ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అదనంగా మరో 17 వేల కోట్లు కేటాయించబోతోందని చెప్పారు. తెలంగాణకు సైతం రూ.340 కోట్లు అదనంగా రాబోతున్నాయని తెలిపారు. ఇంత గొప్ప పథకాన్ని అడ్డుకోవాలని చూడటం కాంగ్రెస్ నీచ రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరును తీసేయడంపై కాంగ్రెస్ అనవసరం రాద్దాంతం చేస్తోందన్నారు.
పాల కులు మారినప్పుడు పథకాల పేర్లు మారడం సహజమేనని, గతంలో వాల్మీకీ, అంబేద్కర్ పేర్లతో వాజ్ పేయి ప్రభుత్వం వాంబే స్కీం పేరుతో ఇండ్ల నిర్మాణ పథకాన్ని ప్రవేశపెడితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వారి పేర్లను తొలగించి ఇందిరాగాంధీ ఆవాస్ యోజన పథకంగా మార్చారని గుర్తు చేశారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా నామకరణం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
జిల్లాల పునర్ వ్యవస్థీకరణ విషయంలో కేసీఆర్ ఇష్టానుసారంగా వ్యవహరించారని, కుటుంబ ఆస్తులను పంచినట్లుగా కొడుకు, కూతురు, అల్లుడి కోసం జిల్లాలను ఏర్పాటు చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అదే తీరులో చేస్తే ఇబ్బందులు తప్పవని, తక్షణమే అఖిలపక్షం ఏర్పాటు చేసి ప్రజాభి్ర పాయ సేకరణ జరపాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ స్టాండ్ క్లీయర్ గా ఉందని, మతపరమైన రిజర్వేషన్లను తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు.
బీజేపీ అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లను తొలగించి బీసీలకు రిజర్వేషన్లను అమలు చేస్తామన్నా రు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ అధ్యక్షుడు బాససత్యనారాయణ, మాజీ డిప్యూటీ గుగ్గిళ్ల రమేశ్, వాసాల రమేశ్, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.