4 April, 2026 | 2:35 PM

Breaking News

వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •   క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు   •  

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించం

10-12-2025 12:26 AM

జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య హెచ్చరిక

11 మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ

జోగిపేట(సంగారెడ్డి), డిసెంబర్ 9(విజయక్రాంతి) : ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని, నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించక తప్పదని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య హెచ్చరించారు. మంగళవారం జోగిపేట ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె హాజరు రిజిస్టర్ పరిశీలించగా పలువురు వైద్యులు విధులకు హాజరు కాకపోవడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గైర్హాజరైన వైద్యులు, సిబ్బంది వివరాలను, డిప్యూటేష్ప ఉన్న సిబ్బంది వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. విధులకు గైర్హాజరైన 11 మంది వైద్యులకు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డిసిహెచ్‌ఓను ఆదేశించారు. ఓపి, డయాలసిస్, ఐసియుతో సహా అన్ని విభాగాలను ఆమె పరిశీలించారు. రోగులకు అందిస్తున్నసేవలు, పరికరాల వినియోగం, శుభ్రత, మందుల లభ్యత వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొంతమంది రోగులతో మాట్లాడి ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రభుత్వ ఆసుపత్రులలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా మెరుగైన వైద్య చికిత్సలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నామన్నారు.

రోగులకు వైద్య సేవలు అందించడంలో వైద్యులు, వైద్య సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వైద్యవృత్తి ఎంతో పవిత్రమైనదని, ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్య సిబ్బంది స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. కలెక్టర్ వెంట రెవెన్యూ డివిజనల్ అధికారి పాండు, తహసీల్దార్ మధుకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.