హామీలు అమలు చేయకుంటే నిలదీస్తాం
- దివ్యాంగుల పెన్షన్ పెంచే వరకు ఉద్యమం
- సీపీఎం నాయకుడు జూలకంటి రంగారెడ్డి
ముషీరాబాద్, డిసెంబర్ 10: (విజయక్రాంతి): దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. దివ్యాంగులకు పెన్షన్ రూ. 6 వేలు పెంచే వరకు ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు. మంగళవారం ఇందిరా పార్కు ధర్నాచౌక్‌లో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నాను నిర్వహించారు.
ఈ ధర్నాలో ఆయన మాట్లాడుతూ పాలకుల అసమర్థత దివ్యాంగుల పాలిట శాపంగా మారిందని అన్నారు. వారికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలనే ఆలోచన ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.
కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు, ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్వి అడివయ్య, టీడీపీ సీనియర్ నాయకుడు సాయిబాబా ప్రసంగించారు. ధర్నాలో ఆర్. వెంకటేశ్, యశోద, స్వామి, బస్వరాజు, దశరథ్, ఆరీఫా, రాజు, నాగలక్ష్మీ, గంగాధర్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.






