13 June, 2026 | 2:15 AM

ట్రాఫిక్ రహిత సమాజం కోసం రాజిలేని కృషి చేస్తాం

13-06-2026 01:13 AM

పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ

కూకట్ పల్లి, జూన్ 12 (విజయక్రాంతి): ట్రాఫిక్ రహిత సమాజం కోసం రాజి లేని కృషి చేస్తామని పీఏసీ చైర్మన్ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి ఉష ముళ్ళపూడి కమాన్ నుండి గాజుల రామారం చౌరస్తా వరకు జరుగుతున్న 100 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులను మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఉషా ముల్లపూడి కమాన్ నుండి ఎల్లమ్మబండ ద్వారా గాజులరామారం వరకు వెళ్లే ప్రయాణికులు నిత్యం ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ దారిలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి 100 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు చేపట్టినట్లు తెలిపారు.

రోడ్డు విస్తరణలో ఉన్న అడ్డంకులను తొలగిస్తూ తీసుకోవాల్సిన చర్యలపై గతంలో అధికారులతో కలిసి చేపట్టిన పాదయాత్రను ఈ సందర్భంగా గుర్తు చేశారు. రోడ్డు విస్తరణ పనుల ను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో చేయాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ గారు శేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి, అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని నియోజకవర్గాన్ని  ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.