నూటికి నూరు శాతం రుణమాఫీ చేసి తీరుతాం

28-04-2024 01:06:15 AM

l చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి

మహేశ్వరం/వికారాబాబాద్, ఏప్రిల్ 27: ఆగస్టు 15 లో గా రైతు రుణమాఫీ నూటికి నూరు శాతం అమలు చేసి తీరుతామని చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి స్పష్టంచేశారు. శాసన సభ ఎన్నికల్లో ఇచ్చిన మాట ను నిలుపుకుంటూ ఆరు గ్యారెంటీలను అమలు చేశామని, పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా తప్పకుండా అమ లు చేస్తామని తెలిపారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గం కందుకూర్ మండలం సరస్వతిగూడ, లేమూరు, తిమ్మాపూర్, గూ డురు, పులిమామిడి, నేదునూర్‌తోపాటు జల్‌పల్లి మున్సిపల్ పరిధిలో ప్రచారం నిర్వహించారు. ప్రజలను నేరుగా కలుస్తూ ఓటేయమని అభ్యర్థించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు ఎన్నికల సమయంలో కొత్త డ్రామాలకు తెర తీశారని మండిపడ్డారు. సర్కార్ వచ్చి ౪ నెలలు గడవక ముందే మాటల దాడి చేయడం బాధకరమన్నారు. ప్రచారంలో మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, నియోజకవర్గం ఇన్‌చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహ్మారెడ్డి, ఎన్నికల ఇన్‌చార్జి నేరెళ్ల శారద తదితరులు పాల్గొన్నారు. 

రంజిత్‌రెడ్డిని మరోసారి పార్లమెంట్‌కు పంపించాలి: స్పీకర్ గడ్డం ప్రసాద్

పేదల కోసం పనిచేసే రంజిత్‌రెడ్డిని మరోసారి పార్లమెంట్‌కు పంపించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కోరారు. శనివారం వికారాబాద్‌లో జిల్లా ఎస్సీసెల్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. రంజిత్‌రెడ్డి మంచి మనస్సున్న వ్యక్తి అని.. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆయనను పిలిచి టికెట్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇలాంటి మంచి వ్యక్తిని మరోసారి పార్లమెంట్‌కు పంపిస్తే చేవెళ్ల అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కులాల పేరుతో బీజేపీ విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తుంటే రాహుల్ గాంధీ అందరిని కలిపే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలిపించుకోవాలని చెప్పారు. అందులో మొదటి సీటు చేవెళ్ల పార్లమెంట్ కావాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్, బంట్వారం జడ్పీటీసీ సంతోషరాజు, ఎస్సీ సెల్ నాయకుడు రాజు, మల్లేష్, పెండ్యాల అనంతయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.