calender_icon.png 15 November, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తండా బడిపై పట్టింపేది?

15-11-2025 01:09:17 AM

  1. పాఠశాలకు భవనం లేక విద్యార్థుల అవస్థలు... 

పట్టించుకోని అధికారులు

తాడ్వాయి, నవంబర్, 14 (విజయ క్రాంతి ): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని అప్పటి ప్రభుత్వం ప్రత్యేక హామీలు ఇచ్చింది. కానీ వాటిని ఆచరణలో పెట్టడంలో పూర్తిగా విఫలమైంది.ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు నాన అవస్థలు పడుతున్నారు.మౌలిక సౌకర్యాలే కాదు కదా కనీసం పాఠశాలకు భవనం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైనం.

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ పరిధిలోని పల్లె గడ్డ తండాలో నెలకొంది. పల్లె గడ్డ తండాలో 1 నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల కొనసాగుతుంది. ఈ పాఠశాల ప్రారంభమైన నాటి నుంచి విద్యార్థులు అవస్థలు పడుతూనే ఉన్నారు. గతంలో పాఠశాల భవనం  శిథిల దశలో ఉండడంతో ఎప్పుడు కూలిపోతుందోనని  విద్యార్థులు భయపడుతూ విద్యను అభ్యసించారు.

భవనం శిథిల దశలో ఉండడం, ఆవరణలో చెత్తాచెదారం ఉండడంతో తరగతి గదుల్లోకి క్రిమి కీటకాలు వచ్చేవి. తరగతి గదిలోకి పాములు తేళ్లు రావడంతో విద్యార్థులు భయపడుతూ ఉండేవారు. అనంతరం శిథిల దశలో ఉన్న  పాఠశాల భవనాన్ని కూల్చివేయడంతో నాలుగు సంవత్సరాల కాలం పాటు చెట్ల కిందే విద్యార్థులు విద్యను అభ్యసించారు. చెట్ల కింద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గుడిసెలో బిక్కుబిక్కుమంటూ విద్యార్థులు చదువుకున్న పరిస్థితి నెలకొని ఉండేది.

అసంపూర్తిగా పాఠశాల భవనం నిర్మాణం..

పల్లె గడ్డ తండా ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి 2023 సంవత్సరంలో ప్రభుత్వం మన ఊరు, మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక మౌలిక వసతుల ఏర్పాటు కోసమై భవన నిర్మాణాన్ని చేపట్టింది. ఈ భవన నిర్మాణానికి రూ.36.50 లక్షలు మంజూరు చేసింది.కానీ పూర్తిస్థాయిలో నిధులు విడుదల కాకపోవడంతో భవన నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. సధరు కాంట్రాక్టర్ పిల్లర్లు నిర్మించి స్లాబు వేసి వదిలిపెట్టారు.

దీంతో భవనం పూర్తి కాకుండానే పనులు నిలిచిపోయాయి. భవన నిర్మాణానికి కాను ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన సకాలంలో విడుదల చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు పేద పిల్లలకు ఉచితంగా అన్ని వసతులతో కూడిన విద్యను అందిస్తామని ప్రగల్బాలు పలుకుతున్న ఆచరణలో మాత్రం పెట్టడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు.

భవనం లేకపోవడంతో తమ పిల్లలు వానలో నానుతూ ఎండలో ఎండుతున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే భవన నిర్మాణానికి అవసరమయ్యే నిధులను మంజూరు చేసి పాఠశాల భవనాన్ని పూర్తి చేయాలని తండావాసులు కోరుతున్నారు.

చెట్ల కింద, స్లాబు కింద విద్యాబోధన 

పాఠశాలకు సరైన భవనం లేకపోవడంతో ఉపాధ్యాయులు స్లాబ్ కింద కొన్ని గంటలు, చెట్ల కింద కొన్ని గంటలు విద్యార్థులను కూర్చోబెట్టి విద్యాబోధన నిర్వహి స్తున్నారు. . పాఠశాలలో మొత్తం 23 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.13 మంది బాలురు, పదిమంది బాలికలు మొత్తం 23 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యాబోధన నిర్వహిస్తున్నారు.

మూడు తరగతులు ఒకచోట,రెండు తరగతులు ఒకచోట కూర్చోబెట్టుకొని విద్యా బోధన చేస్తున్నారు. ప్రస్తుతం చలికాలం కావడంతో చలిగాలికి బయట కూర్చుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉపాధ్యాయులు తెలిపారు. చలి నుంచి తట్టుకోవడం కోసం తాత్కాలికంగా పరదలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. పాఠశాల ఆవరణలో ఉన్న మరుగుదొడ్లు సైతం అద్వాన్న స్థితిలో ఉన్నాయి.

పాఠశాల భవనానికి వెంటనే నిధులు మంజూరు చేయాలి 

పాఠశాల భవన నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు. పాఠశాలకు సరైన భవనం లేకపోవడంతో తమ పిల్లలను పాఠశాలకు పంపించాలంటేనే భయంగా ఉందని వారు పేర్కొంటు న్నారు. వర్షాకాలంలో వర్షాలు కురుస్తున్న సమయంలో తమ పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తల్లిదండ్రులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే పాఠశాల భవనానికి అవసరమైన పూర్తి నిధులు మంజూరు చేసి భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు.