15-11-2025 01:10:04 AM
-మొన్న కంటోన్మెంట్.. నేడు జూబ్లీహిల్స్‌పై కాంగ్రెస్ జెండా
-పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం
-సీఎం వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రచారం
-కలిసొచ్చిన బీసీ నినాదం.. పోల్‌మేనేజ్మెంట్‌లో సక్సెస్
-ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా సమాధానం
హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి) : అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మొదట కంటోన్మెంట్‌లో గెలుపొందిన కాంగ్రెస్.. ఇప్పుడు జూబ్లీహిల్స్‌ను సైతం హస్తగతం చేసుకుంది. దీంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం తొణికిసలాడుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ ..ప్రచారంలో వ్యూహాత్మకంగా ముందుకెళ్లి విజయం దక్కించుకుంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో, టీపీసీసీ అధ్యక్షు డు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, పార్టీ నేతలందరూ సమన్వయంతోనే ఈ విజయానికి ప్రధాన కారణమనే అభిప్రాయం కాంగ్రెస్‌లో వ్యక్తమవుతోంది. ఒక వైపు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు వివరిస్తూనే.. బీసీ నినాదం కూడా కలిసొచ్చేలా చేసుకుందని చర్చ జరుగుతోంది.
అంతే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ఆఫీస్ బేరర్స్‌తో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ స్పష్టమైన దిశా నిర్దేశం చేస్తూ నవీన్‌యాదవ్‌ను గెలుపు దిశగా నడిపించారనే ప్రచారం జరుగుతోం ది. రేయింబవళ్లూ శ్రమించి, ప్రతీ బూత్, డివిజన్ స్థాయిలో పర్యవేక్షణ చేపట్టడం, జూమ్ సమావేశాలతో పాటు పోల్ మేనేజ్మెంట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయ్యిందనే చెప్పొచ్చు.
బీఆర్‌ఎస్ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో సక్సెస్
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమలను అమలు చేస్తుంటే.. బీఆర్‌ఎస్ ఓర్చుకోలేక తమ ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూనే.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, మిగిలిన వాటిని కూడా అమలు చేయాల్సి ఉందం టూ ప్రజలకు అధికార పార్టీ నాయకులు వివరించారు.
రాష్ర్ట ఆర్థిక పరిస్థితి, అప్పులు, వడ్డీలు, అభివృద్ధి, సంక్షేమంతో పాటు గత ప్రభుత్వలో జరిగిన తప్పిదాలను ప్రజల ముందుచ్చారు. అయితే సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి రెండేళ్లు కావ డం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పాలనకు గీటు రాయిగానే మారుతందనే చర్చ జరిగింది.
జూబ్లీహిల్స్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ పాలనపై వ్యతిరేకత ఉందని ప్రతిపక్ష పార్టీ లు విమర్శలు చేశాయి. అయినా సీఎం రేవంత్‌రెడ్డి మొక్కవోని ధీమాతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యా దవ్‌ను ప్రకటించి పోటీకి కావాల్సిన దిశానిర్దేశం చేశారు. స్వయం గా ఆయనే వచ్చి జూబ్లీహిల్స్లో ఎన్నికల ప్రచారం చేశా రు. రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహిస్తూనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎం పీలు, పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంలో సక్సెస్ అయ్యారనే చర్చ జరుగుతోంది. బీసీ బిడ్డ నవీన్ యాదవ్‌ను గెలిపించాలని ఓటర్లకు చేసిన విజ్ఞప్తి ఫలించిందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
‘రప్పా.. రప్పా’ ఫ్లెక్సీతో సంబురాలు
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించడంతో.. ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. గాంధీభవన్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునితారావు, పిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్‌తో పాటు వందలాది మంది కార్యకర్తలు ఉత్సాహంతో డ్యాన్స్‌లు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్ ఫొటోలతో ఉన్న ‘రప్పా.. రప్పా’ ఫ్లెక్సీలు ప్రదర్శించారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటుపై చర్చ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించడంతో.. ఇప్పుడు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల చుట్ట్టూ రాజకీయ చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన వారిలో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని, వారిపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ నేతలు స్పీకర్, సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ పదిమంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ సమక్షంలో విచారణ జరుగుతోంది.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశామని, పార్టీ మారలేదని చెబుతున్నారు. అయితే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం బీఆర్‌ఎస్ నుంచి గెలిచి.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. దీంతో ఎమ్మెల్యే దానంపై అనర్హత వేటు పడుతుందనే చర్చ జరుగుతోంది. ఒక వేళ ఎమ్మెల్యే దానంపై వేటు పడితే సీఎం రేవంత్‌రెడ్డి మరో టాస్క్ ఎదుర్కోవాల్సి వస్తుంది.