గుమ్మడిదల కానుకుంట ప్రధాన రహదారి పనులు ఏమాయే.?
చినుకు పడితే చాలు రోడ్డంతా చిత్తడి చిత్తడే...
గుమ్మడిదల, జూలై 30: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గుంతలమయంగా మారిన రోడ్డుపై ప్రయాణించడం చాలా ఇబ్బందికరంగా మారింది. గత నాలుగు ఐదు సంవత్సరాల నుండి గుమ్మడిదల నుండి కానుకుంట ప్రధాన రహదారి విషయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నిర్మాణాలు చేపట్టనున్నామని శంకుస్థాపనలు చేయడం జరిగినప్పటికీ పనులు సాగడం లేదు.
దీంతో ఈ రహదారిపై ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజాప్రతినిధులకు రోడ్డు నిర్మాణం పనులు వెంటనే చేపట్టాలని మొరపెట్టుకున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల ముందు కల్లబొల్లి మాటలు చెప్పి సీట్లెక్కిన తర్వాత కనీసం గ్రామాల పరిస్థితి ఎంత అధ్వనంగా ఉందని చూడడానికైనా రాకపోవడం శోచనీయమని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా గుమ్మడిదల కానుకుంట రోడ్డు విషయంలో తనకేమి పట్టనట్టే వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ రోడ్డుపై ప్రయాణిస్తూ కొన్ని కుటుంబాల యువకులు వృద్ధులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు సైతం పోయాయని, ఇకనైనా పాలకులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వెంటనే రోడ్డు నిర్మాణం పనులు చేపట్టే దిశగా పనిచేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.అన్నారం నుండి జిన్నారం రోడ్డు పనులు చేపట్టాలి...ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు అన్నారం నుండి జిన్నారం వరకు గల రోడ్డు గుంతలమయంగా మారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ విషయంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం వెంటనే రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపనలు చేపట్టినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడంతో ఆ రోడ్డు గుండా ప్రయాణించే ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభించే దిశగా పనిచేయాలని ప్రాంత ప్రజలు కోరుతున్నారు.






