8 July, 2026 | 2:04 AM

తొమ్మిదిన్నరేండ్లలో మీరేం చేశారు?

08-07-2026 01:14 AM
  1. కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చారు
  2. బీఆర్‌ఎస్‌పై పీసీసీ అధ్యక్షుడు మండిపాటు

హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి) : కాళేశ్వరంపై బీఆర్‌ఎస్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని, కాళేశ్వరం పేరుతో కేసీఆర్ కుటుంబం వేల కోట్ల అవినీతికి పాల్పడిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ విమర్శించారు. ఇంజినీర్ల మాట వినకపోవడంతో కాళేశ్వరం కూళేశ్వరంగా మారిందని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరాన్ని వారం రోజులు అప్పగిస్తే నీళ్లు ఇస్తామని చెబుతున్న కేటీఆర్..  తొమ్మిదిన్నరేండ్లలో ఏమి చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీళ్లు తీయవద్దని కేంద్రంలోని బీజేపీ  ప్రభుత్వం చెబుతుంటే..ఆ పార్టీకి చెందిన ఎంపీ ఈటల రాజేందర్ మాత్రం అందుకు విరుద్దంగా మాట్లాడుతున్నారని మహేష్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. ఈటల రాజేందర్ బీజేపీ నేతలా మాట్లాడుతున్నారో, లేక బీఆర్‌ఎస్ ఏజెంట్‌గా మాట్లాడుతున్నారో ప్రజలకే అర్థం కావడం లేదన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ  ఎంపీ ఈటల మాటలు బీజేపీ లైన్‌లో ఉన్నాయా..? బీఆర్‌ఎస్ స్క్రిప్ట్‌లో ఉందా..? అనేది తెలంగాణ సమాజం గమనిస్తోందని, బీఆర్‌ఎస్, బీజేపీలు రెండూ ఒకటేనని తాము మొదటి నుంచి చెప్తూనే ఉన్నామన్నారు. అవినీతితో కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం కూల్చివేస్తే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతోందన్నారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునాదుల నాణ్యత అనుమానాస్పదంగా ఉన్నాయనే వాస్తవం కేటీఆర్‌కు తెలియదా..?  నాణ్యతా లోపంతో ఉన్న ప్రాజెక్టులో పంపులు ఆన్ చేస్తే ఏమవుతుందో తెలిసికూడా కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేయడమేంటన్నారు. త్వరలోనే సాంకేతిక పరీక్షలతో ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా నీళ్లు విడుదల చేయొద్దని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌డీఎస్‌ఏనే చెప్పిందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఆడుతున్న ఈ కపట నాటకాలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ముందు ఖచ్చితంగా ఎండగడుతుందన్నారు.