calender_icon.png 28 December, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘డ్రగ్స్’ నివేదిక ఏమాయె?

28-12-2025 12:04:06 AM

పండుగలప్పుడే డ్రగ్స్ కేసులు నమోదు చేస్తారా?

మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌ను విచారించాలి

కేంద్రమంత్రి బండి సంజయ్

హైదరాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): పండుగలు, నూతన సంవత్సరం వేడుకల సమయంలోనే డ్రగ్స్ కేసుల నమోదుకు పరిమితం అవుతున్నారే తప్ప రాష్ర్ట పభుత్వం సీరియస్‌గా వ్యవహరించడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో జరిపిన ‘డ్రగ్స్ కేసు’ విచారణ నివేదికపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నాటి డ్రగ్స్ కేసులో అనేక మంది బడా వ్యక్తుల పేర్లు, సినీ ప్రముఖులు ఉన్నారని తెలుపుతూ శనివారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు.

డ్రగ్స్ కేసులో పట్టుబడిన వాళ్లను అకున్ సబర్వాల్ టీం నాడు విచారణ చేస్తే కేసీఆర్ కుటుంబ సభ్యులకు డ్రగ్స్ విక్రయదారులతో సంబంధాలున్నాయని తేలిందన్నారు. ఆ కుటుంబ సభ్యులు సైతం తమతో కలిసి డ్రగ్స్ తీసుకున్నారని డ్రగ్స్ కేసులో పట్టుబడిన నిందితులు ఆనాడు అకున్ సబర్వాల్ టీం ఎదుట వాంగ్మూలమిచ్చారని పేర్కొన్నారు. ఆ వాంగ్మూలంతో కూడిన ఆడియో, వీడియో రికార్డులు బయటకొస్తే తన కు టుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్ సమాధి అవుతుందని భయపడ్డ నాటి సీఎం కేసీఆర్ అకున్ సబర్వాల్‌ను అర్ధ్ధంతరంగా డ్రగ్స్ కేసు బాధ్యతల నుంచి తప్పించారని తెలిపారు.

అదే సమయంలో ఆ కేసుపై అకున్ సబర్వాల్ టీం రూపొందించిన నివేదికను, రికార్డు చేసిన ఆడియో, వీడియో, స్టేట్ మెంట్లన్నింటినీ నాటి సీఎస్ సోమేశ్ కుమార్ స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. ఆ తరువాత డ్రగ్స్ కేసును పూర్తిగా నీరుగార్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా డ్రగ్స్ నిర్మూలనపై చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి రేంవత్‌రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్న “ఈగల్‌” టీం వెంటనే రంగంలోకి దిగి సోమేశ్ కుమార్‌ను విచారణ జరపాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.