calender_icon.png 28 December, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ సేఫ్.. తగ్గిన నేరాలు!

28-12-2025 12:03:10 AM

  1. గతేడాదితో పోల్చితే 15 శాతం తగ్గుదల
  2. మహిళలకు పెరిగిన భద్రత
  3. గణనీయంగా తగ్గిన కిడ్నాప్, అత్యాచార కేసులు
  4. 2025 వార్షిక నివేదక వెల్లడించిన సీపీ సజ్జనార్

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 27 (విజయక్రాంతి): విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ శాంతిభద్రతల విషయంలోనూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. అత్యాధునిక సాంకేతికత, నిరంతర నిఘా, ప్రజల భాగస్వామ్యంతో 2025లో నేరాల రేటును గణనీయంగా తగ్గించగలిగామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. శనివారం బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో -2025 వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. తాము చేపట్టిన ఆపరేషన్ కవ అంతర్రాష్ర్ట ముఠాలకు సింహస్వప్నంగా మారిందన్నారు.

ఫలితంగా గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 15 శాతం నేరాలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు. షీ టీమ్స్, భరోసా కేంద్రాల పనితీరు వల్ల మహిళలపై నేరాలు 6 శాతం తగ్గాయని పేర్కొన్నారు. చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించిన పోక్సో  కేసులు కూడా గణనీయంగా తగ్గాయన్నారు. గతేడాది 484 అత్యాచార కేసులు నమోదు కాగా, ఈ ఏడాది అవి 405 నమోదయ్యాయి. గతేడాది 324 కిడ్నాప్ కేసులు నమోదవగా.. ఈసారి అవి 166 నమోదయ్యాయి. 

సివిల్ తగాదాలకు చెక్

పోలీసులు సివిల్ తగాదాల్లో తలదూర్చకూడదన్న ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నామని, అలాగే ఆస్తి సంబంధిత నేరాలను అరికట్టడంలోనూ సఫలమయ్యామని సీపీ తెలిపారు. ప్రాపర్టీ వివాద కేసులు ఏకంగా 64 శాతం మేర తగ్గాయని, ఇది చాలా పెద్ద విజయమని ఆయన అభివర్ణించారు.

ప్రజలకు పోలీసులపై నమ్మ కం పెరిగిందని, అందుకే ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నారని చెప్పా రు. ప్రస్తుత డిజిటల్ యుగంలో అతిపెద్ద సవాలుగా మారిన సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అహర్నిశలు శ్రమిస్తోందని సజ్జనార్ తెలిపారు. ఫలితంగా సైబర్ నేరాలు 8 శాతం తగ్గాయని వివరించారు.

రోడ్డు ప్రమాదాలకు కళ్లెం

ట్రాఫిక్ విభాగం చేపట్టిన కఠిన చర్యల వల్ల అనేక ప్రాణాలను కాపాడగలిగామని సీపీ సంతోషం వ్యక్తం చేశారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, హెల్మె ట్ నిబంధనలు, రాష్ డ్రైవింగ్‌పై స్పెష ల్ డ్రైవ్స్ నిర్వహించడం వల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య గతేడాది ఉన్న 3,058 నుంచి ఈ ఏడాది 2,678కి తగ్గిందన్నారు.

కాగా మాదకద్రవ్యాల మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు వచ్చే ఏడాది 2026 నుంచి నగరంలోని ప్రతి జోన్‌లోనూ ప్రత్యేక నార్కోటిక్ ఎన్‌ఫోర్స్ మెంట్ టీమ్ లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. నూతన సంవత్స ర వేడుకల సందర్భంగా నగరవాసులను సీపీ అప్రమత్తం చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకేనని హెచ్చరించారు.