calender_icon.png 6 December, 2024 | 3:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుకున్నది ఒకటి.. అయినది ఒకటి

05-11-2024 12:30:33 AM

  1. మేడ్చల్‌లో ఫ్లుఓవర్ పనులతో దుకాణదారులకు తగ్గిన గిరాకీ
  2. మూతపడుతున్న దుకాణాలు

మేడ్చల్, నవంబర్ 4: మేడ్చల్ పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు తొలగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఫ్లుఓవర్ నిర్మాణం చేపట్టింది. పట్టణం మధ్య నుంచి 44వ నంబర్ జాతీయ రహదారి వెళ్తుండటం వల్ల నిత్యం రద్దీ ఉంటుంది. తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.

సీఎంఆర్ కాలేజీ నుంచి పట్టణం అవతలి వరకు ఫ్లుఓవర్ నిర్మించడం వల్ల పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు తొలగడమేగాక, ప్రమాదాలు తగ్గుతాయి. ఇది నాణానికి ఒకవైపు. మరోవైపు ఫ్లుఓవర్ పనుల వల్ల రోడ్డు ఇరుకుగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందవుతోంది. దుకాణాల ముందు వాహనాలు నిలిచిపోతున్నాయి.

దుకాణం ముందు పార్కింగ్ చేసే అవకాశం లేకపోవడంతో కొనుగోలుదారులు రావడం లేదు. దీంతో నిర్వహణ భారంగా మారి దుకాణాలు మూసేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ పలు దుకాణాలు మూసేయగా మరికొన్ని అదే దారిలో ఉన్నాయి. ఏడాది క్రితం వరకు పట్టణంలో వ్యాపారాలు బాగా నడిచేవి. స్థానికులతో పాటు జాతీయ రహదారి మీద దూరప్రాంతాలకు వెళ్లే వారు సైతం హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, వైన్స్‌ల వద్ద ఆగేవారు.

ఫ్లుఓవర్ మొదలైనప్పటి నుంచి..

ఫ్లుఓవర్ పనులు మొదలైనప్పటి నుంచి వ్యాపారులకు కష్టాలు మొదలయ్యాయి. ఫ్లుఓవర్ పూర్తయితే దూరప్రాంతాలకు వెళ్లే వాహనాలు నేరుగా వెళ్లిపోతాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద నాలుగు షటర్లలో అట్టహసంగా ప్రారంభించిన ఒక బేకరీ నెల రోజుల్లోనే మూతపడింది. అదే ప్రాంతంలో ఒక కంపెనీ సూపర్ మార్కెట్ కూడా మూతపడింది. ఈకంపెనీకి దేశవ్యాప్తంగా వందల్లో స్టోర్‌లు ఉన్నాయి.

అన్నీ బాగా నడుస్తుండగా మేడ్చల్‌లో మూతపడటం గమనార్హం. హాట్ చిప్స్ దుకాణం, ఒక రెస్టారెంట్, బ్రాండెడ్ రెడీమెడ్ బట్టల దుకాణాలు మూతపడ్డాయి. ఇండియన్ పెట్రోల్ పంపు సమీపంలో కూడా కొన్ని దుకాణాలు మూతపడ్డాయి. గతంలో రహదారి మీద మడిగెలకు డిమాండ్ ఉండటంతో అద్దె పెద్దమొత్తంలో ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు. వ్యాపారాలు తగ్గడంతో అద్దె భారమై మూసేస్తున్నారు.

కళతప్పిన చెక్‌పోస్టు..

మేడ్చల్‌కు కిలోమీటర్ దూరంలో ఉన్న చెక్‌పోస్టు ఏరియా ఒకప్పుడు వాహనాలు, జనాలతో కళకళలాడేది. దీనికి ఎడమవైపు శామీర్‌పేట్ రోడ్డు, కుడివైపు గండిమైసమ్మ రోడ్డు ఉన్నాయి. దూరప్రాంతాలకు వెళ్లేవారు ఇక్కడి హోటళ్లలో ఆగేవారు. ప్రస్తుతం ఫ్లుఓవర్ నిర్మాణ పనులు కొనసాగతున్నందున ఇక్కడ వాహనాలు ఆగడం లేదు.

పనుల వల్ల యూటర్న్ కూడా తీసేశారు. ఇక్కడి హోటళ్ల గిరాకీ బాగా తగ్గింది. ఒక హోటల్ వారు ముందస్తుగా కాళ్లకల్ వద్ద బ్రాంచ్ వేశారు. మరో హోటల్ మూసేశారు. దీంతో చెక్‌పోస్టు ఏరియా కళావిహీనంగా తయారైంది.