05-12-2025 12:44:17 AM
ఢిల్లీ పరిస్థితి హైదరాబాద్‌కు రావద్దనే పరిశ్రమల తరలింపు
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెడితే తప్పేంటని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రశ్నించారు. విగ్రహం ఏర్పాటు విషయంలో కుల, మతం పేరిట రాజకీయం చేయడం సరికాదని పేర్కొన్నారు. బాలసుబ్రహ్మణ్యం దేశం గర్వించదగ్గ గాయకుడని, కళాకారులు, సాహిత్యకారులకు కులమతాలను ఆపాదించడం తగదని హితవుపలికారు.
తెలంగాణ, ఆంధ్ర భౌగోలికంగా విడిపోయినా అన్నదమ్ముళ్లుగా కలిసే ఉందామని కోరారు. బాల సుబ్రహ్మణ్యం తెలుగు వ్యక్తి అని, విగ్రహం విషయాన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాపాలన రెండేళ్ల సంబురాలను దృష్టి మళ్లించేందుకు ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. తెలం గాణలో మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తంచేశారు.
వాయు కాలుష్యం వల్ల దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి చూస్తే బాధేస్తుందని చెప్పారు. ఢిల్లీ పరిస్థితి హైదరా బాద్‌కు రావొద్దన్న ఉద్దేశంతోనే హిల్ట్ పాలసీ తీసుకొస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని, ప్రజాపాలనలో వికాసం దిశగా తెలంగాణ ముందుకు పోతున్నదని వివరించారు. పరిశ్రమలు హైదరాబాద్ నడిబొడ్డున ఉండటం వల్ల కాలుష్యం పెరిగిపో తున్నదని, తమ ప్రభుత్వం దూరదృష్టితో పనిచేస్తోందని చెప్పారు.
ఈ పాలసీ వల్ల ప్రజలకు అందుబాటులోకి భూముల ధ రలు వస్తాయని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇన్ అండ్ ఔటర్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టినప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలతో బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అని తేలిపో యిందని విమర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో విచ్చలవిడితనంగా దోపిడీ జరిగిందని, గత పదేళ్లు హైదరాబాద్‌ను దోచు కుంటుంటే బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌రెడ్డి సామేత రూపంలో దేవుళ్ల గురించి మాట్లాడితే మత రాజకీయం చేయడం తగదని హితవుపలికారు. కులం, మతం లేకుండా బీజేపీ నేతలకు పూట కూడా గడవదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు మాత్రం కుల, మతం పేరిట రాజకీయాలను పట్టించుకోరన్నారు. డీసీసీ అధ్యక్షుల ఎంపిక విషయంలో ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టంచేశారు.