22 July, 2026 | 2:04 AM

వస్తువుల సేకరణ, నిర్వహణ

22-07-2026 12:00 AM

పాలకుర్తి రామమూర్తి :

కోష్ఠాగారాధ్యక్షః సీతా, రాష్ట్ర, 

క్రయిమ, పరివర్తక,

ప్రామిత్యక, అపమిత్యక, 

సింహనికాన్యజాత,

వ్యయప్రత్యాయోపస్థానాని ఉపలభేత!

(కౌటిలీయం- 2-15)

రాజ్యం సుస్థిరంగా ఉండాలంటే సమర్థుడైన అధికారి పర్యవేక్షణ లో, పన్నుల రూపంలో, ప్రజల నుంచి ధనధాన్యాలు, వివిధ వస్తువుల సేకరణ, నిర్వహణ జరగాలి. అలా వివిధ వస్తువులను సేకరించి భద్రపరిచే స్థానాన్ని ‘కోష్ఠాగారం’ అంటారు. దాని అధ్యక్షుడు కోష్ఠాగారాధ్యక్షుడు. అతడు వివిధ అంశాలను పరిశీలనాపూర్వకంగా తెలుసుకోవాలి అంటున్నాడు, ఆచార్య చాణక్య. వాటిని సద్వినియోగం చేసినప్పుడు రాజ్యం సుభిక్షమవుతుంది.

వివిధ సస్యజాతుల ద్వారా వచ్చే పన్నును ‘సీత’ అన్నారు. చెరువులు, ఉద్యానవనాలు మొదలైన వివిధ రూపాలలో రాష్ట్రానికి లభిం చే ఆదాయాన్ని ‘రాష్ట్రం’, కోష్ఠాగారానికి వచ్చిన ధాన్యాన్ని అమ్మగా వచ్చిన సొమ్ము, దానిని వెచ్చించి మరొక అవసరమైన ధాన్యాన్ని కొనుగోలు చేయడం, ఇతరులకు ఇచ్చిన దానికి వడ్డీని తీసుకోవడం.. ఈ మూ డింటిని ‘క్రయిమం’ అన్నారు.

ఒక ధాన్యాన్ని ఇచ్చి మరొక ధాన్యాన్ని తీసుకోవడం ‘పరివర్తకం’, ఇతరుల నుంచి యాచించి తీసుకోవ డం ‘ప్రామిత్యకం’, అప్పుగా తీసుకోవడం ‘అపమిత్యకం’, ధాన్యాన్ని వేరే రూపంలోకి మార్చి వినియోగంలోకి తేవడం ‘సింహనిక’, నష్టమైనది లేదా ఇతరులకు ఇచ్చి మరచిపోయినది ‘అన్యజాతం’, సైన్యానికి లేదా ఆరోగ్యం కోసం కేటాయించిన దానిలో ఖర్చుచేయగా మిగిలినది ‘వ్యయప్రత్యాయం’, తూకాలు కొలతలలో వచ్చిన తేడాలను ‘ఉపస్థానం’ అన్నారు, వ్యాఖ్యాతలు.

ప్రభుత్వం వివిధ రూపాలలో ప్రజల నుంచి సేకరించిన వస్తువులను భద్రపరచి అవసరానుగుణంగా వినియోగించడం ఈనాడూ జరుగుతున్నది. ఆనాటి కౌటిల్యుని నిర్వహణా సూత్రాలకు ఈనాడు అవలంభిస్తున్న వనరుల సమీకరణ, వనరుల వర్గీకరణ, వస్తువులు నిల్వచేయడం, సంరక్షించడం, వ్యయ నియంత్రణ, పర్యవేక్షణలకు భావసారూప్యాన్ని గమనించవచ్చు. నిజానికి ఆనాటి పేర్లు మారవచ్చు కానీ మౌలిక స్వరూపం మారలేదు.

రాజ్యం అభివృద్ధి చెందాలంటే వనరుల సమీకరణ, ఉపాధికల్పన, సంపదను సృష్టించడం, ఆహారభద్రతను సాధించడం, మౌలిక వసతుల కల్పన అవసరం. అలాగే వాటి నిర్వహణా బాధ్యతను సమర్థత, నిబద్ధత కలిగిన వ్యక్తులకు అప్పగించడం వల్ల ఆశించిన ఫలితాలు సాకారమవుతాయి. పాలకులు కోశాన్ని సక్రమంగా పర్యవేక్షించాలి. అనవసర వ్యయాన్ని నిరోధించాలి, వ్యర్థాలను నియంత్రించాలి.

ఈ భావం మహాభారతంలో నారదుడు ధర్మరాజును ప్రశ్నించడంలోనూ, భీష్ముడు ధర్మరాజుకు చేసిన బోధనలలోనూ కనిపిస్తుంది. అలాగే పాండవులు ఖాండవవనాన్ని ఇంద్రప్రస్థంగా అభివృద్ధి చేసినప్పుడు, వారు అక్కడి ఆటవిక భూమిని ప్రజాప్రయోజనాల కోసం వినియోగించడం, జనావాసాల నిర్మాణం, వనరుల సమీకరణ వంటి అంశాల పట్ల తీసుకున్న ముందుజాగ్రత్త చర్యలు చాణక్యుడు సూచించిన విధానాలకు దగ్గరగా కనిపిస్తాయి.

అలాగే పాండవులు రాజసూయ యాగాన్ని నిర్వహించిన సందర్భంలో... వివిధ రాజ్యాల నుంచి వచ్చిన కానుకలు, వస్తువుల నిర్వహణకు ప్రత్యేక వ్యక్తులకు బాధ్యతలు అప్పగించారు. వచ్చిన సంపదను స్వీకరించడం, వర్గీకరించడం, భద్రపరచడం వంటి విధులను ప్రతిభావంతంగా నిర్వహించిన విధానం కనిపిస్తుంది. ఇది చాణక్యుని కోష్ఠాగార నిర్వహణా భావనలకు దగ్గరగా ఉన్నట్లుగా భావించవచ్చు. 

రామాయణంలో రాముని వద్దకు భరతుడు వచ్చిన సందర్భంలో రాముడు, కోశం, ధనాగారం, సైన్యం, అధికారులు, ప్రజల సం క్షేమం వంటి రాజ్యపాలనకు సంబంధించిన అనేక విషయాలను ప్రశ్నిస్తాడు. అందులో ప్రధానంగా రాజు ఆదాయాన్ని సక్రమంగా సమీకరించి, ప్రజల హితానికి వినియోగించాలి, సంపదను బాధ్యతతో సంరక్షించాలనే భావం వ్యక్తమవుతుంది. ఇది కౌటిల్యుడు ప్రతిపాదించిన కోష్ఠాగార నిర్వహణ సూత్రాలను యథాతథంగా చూపకపోయినా, భావసారూప్యత కనిపిస్తుంది.

చరిత్రలో విజయనగర పాలకులు వ్యవసాయాభివృద్ధికి, నీటివనరుల కల్పనకు, ధాన్య నిల్వలకు ప్రాధాన్యతనిచ్చారు. కరువు కాలాలలో ప్రజలకు ఆహార కొరత రాకుండా ధాన్యాన్ని నిల్వ చేసే వ్యవస్థలు ఉండేవి. సంపదను కేవలం సేకరించడమే కాకుండా, అవసరమైన సమయంలో ప్రజల సంక్షేమానికి ఉపయోగించడం అనే భావన కౌటిల్యుని కోష్ఠాగార సూత్రాలకు దగ్గరగా కనిపిస్తుంది.

ప్రతి వస్తువుకూ ఒక నిర్దిష్ట స్థానం ఉండాలి, ప్రతి వస్తువూ దాని స్థానంలోనే ఉండాలి అంటాడు, బెంజమిన్ ఫ్రాంక్లిన్. దీనివల్ల అనవసరమైన వెతుకులా ట లేకుండా సమర్థవంతంగా కార్యనిర్వహణ జరుగుతుంది. దీనికి అనుగుణంగా ‘జపాన్ టయోటా ఉత్పత్తి విధానం’ అమలుచేసిన అయిదు ముఖ్యమైన సూత్రాలను గమనించవచ్చు. టయోటా సంస్థ తన ఉత్పత్తి కేంద్రాల్లో ప్రతి పనిముట్టుకు నిర్దిష్ట స్థానాన్ని కేటాయించి, ఉపయోగించిన వెంటనే దానిని అదే స్థానంలో ఉంచే విధానాన్ని అమలు చేసింది.

ఆ అయిదు సూత్రాలు... 1. అవస రం ప్రాతిపదికగా వస్తువులను వేరు చేసి ఉపయోగం లేని వాటిని తొలగించడం, 2. అవసరమైనప్పుడు సులభంగా తీసుకునేలా ప్రతి వస్తువుకూ నిర్దిష్ట స్థానాన్ని కేటాయించి క్రమబద్ధీకరించడం, 3. పని ప్రదేశాలను, పరికరాలను క్రమం తప్పకుండా శుభ్రపరచ డం.. శుభ్రపరిచేటప్పుడు వాటిలోని సమస్యలను గుర్తించడం, 4. వాటి ప్రామాణికతను నిర్ధారించడం, 5. క్రమశిక్షణను పాటించడం.. వీటిని నిబద్ధతతో పాటించడం వల్ల సమయం ఆదా అవుతుంది, అవసరమైన వస్తువులు అందుబాటులో ఉంటాయి,

పనిలో వేగం, నాణ్యత పెరుగుతుంది, ప్రమాదాలు తగ్గుతాయి, పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన పని వాతావరణం ఏర్పడుతుంది, అనవసరమైన వ్యర్థాలు నియంత్రించబడుతాయి, ఖర్చులు తగ్గుతాయి... అంటారు యాజమాన్య నిర్వహణా నిపుణులు. కౌటిల్యుడు కోష్ఠాగార నిర్వహణలో ప్రతిపాదించిన క్రమబద్ధత, పర్యవేక్షణ సూత్రాలకు టయోటా తన ఉత్పత్తి విధానంలో అమలు చేస్తున్న నిర్వహణ సూత్రాలను ఆధునిక ఉదాహరణలుగా చెప్పవచ్చు.

అలాగే చాణక్య ప్రతిపాదించిన ధాన్యాన్ని నిల్వచేసే విధానం ఈనాడు భారత ప్రభుత్వం అమలుచేస్తున్న ‘భారత ఆహార సంస్థ’ నిర్వహణలోనూ గమనించవచ్చు. పంటలు వచ్చిన కాలంలో ‘భారత ఆహార సంస్థ’ దేశవ్యాప్తం గా రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి గిడ్డంగులలో నిల్వ చేస్తుంది. ప్రతి గిడ్డంగిలో నూ ఆయా ధాన్యానికి సంబంధించిన పరిమాణం, నాణ్యత, నిల్వ చేసిన స్థలం, పంపిణీ వివరాలను రికార్డులలో ప్రతిరోజూ నమోదు చేస్తుంది.

దానితో ఆహార భద్రతను సాధించి, అవసరమైన ప్రాంతాలకు అవసరమైన సమయంలో ధాన్యాన్ని వేగంగా సరఫరా చేస్తుంది. వనరుల సేకరణ, వాటిని భద్రంగా నిల్వ చేయడం, సంరక్షించడం, సక్రమంగా పంపిణీచేయడం, సమర్థవంతంగా పర్యవేక్షించడం సంస్థలో నిరంతరం జరుగుతుంది. ఈ విధానం కౌటిల్యుడు కోష్ఠాగారాధ్యక్షునికి నిర్దేశించిన ఆదాయమార్గాలను గుర్తించడం, సంపదను సంరక్షించడం, వ్యయాన్ని నియంత్రించడం లాంటి బాధ్యతలను స్పురింపజేసే ఆధునిక రూపంగా భావించవచ్చు.