13 August, 2026 | 2:44 AM

200 కోట్లు ఎక్కడివి? కేటీఆర్ చెప్పాలి

13-08-2026 01:11 AM
  1. నిబంధనల మేరకే భూ కేటాయింపులు
  2. బీఆర్‌ఎస్ హయాంలో ఎకరాకు రూ. 90 లక్షలకే.. మా ప్రభుత్వం ఎకరాకు రూ. 1.50 కోట్లకు కేటాయింపు
  3. హిల్ట్‌పాలసీతో హైదరాబాద్ ప్రజలకు ప్రయోజనమే
  4. పారిశ్రామిక వేత్తలను కేటీఆర్ బెదిరించడం సరికాదు
  5. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టీకరణ

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): భూ కేటాయింపుల వ్యవహా రంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. భూ కేటాయింపులపై బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పందించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో ఎకరా భూమిని రూ. 90 లక్షలకే కేటాయించారని, తమ ప్రభు త్వం నిబంధనల ప్రకారం ఎకరాకు రూ. కోటిన్నర లెక్కన కేటాయించినట్లు మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు.

బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, ఐదు ఎకరాల భూమిని రూ. 7.5 కోట్లకు ఇచ్చా మని తెలిపారు. కేటీఆర్ చెబుతున్న రూ. 200 కోట్ల లెక్కలు ఎక్కడినుంచి వచ్చాయో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. అసత్య ప్రచారాలతో ప్రజలను పక్కదోవ పట్టించొద్దని కేటీఆర్‌కు సూచించారు. హిల్ట్ పాలసీతో హైదరాబాద్ ప్రజలకు ప్రయోజనం చేకూరు తుందన్నారు.  పారిశ్రామిక వేత్తలను భయపెట్టడం కేటీఆర్‌కు మంచిది కాదన్నారు.

తెలంగాణ అభివృద్ధ్దిని అడ్డుకోవడం సరికాదని శ్రీధర్‌బాబు హితవు పలికారు. మాపైన ఉన్న కోపాన్ని తెలంగాణ ప్రజలపై చూపొద్దన్నారు. నీటి వాటాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలపై ఎట్టి పరిస్థితులో రాజీపడబోమని మంత్రి స్పష్టంచేశారు. గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశానికి హాజరై.. తెలంగాణకు రావాల్సిన నీటీ వాటాలకోసం బలంగా వాదిస్తామని తెలిపారు. అయితే నీటి వాటాల విషయంలో తెలంగాణకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీవ్ర నష్టం చేసిందని మంత్రి ఆరోపించారు.  కేసీఆర్ ఫాంహౌస్‌లో  పండిన వరికి వచ్చిన ధర.. తెలంగాణ రైతులకు ఎందుకు రాలేదో కూడా కేటీఆర్ చెప్పాలన్నారు.

బీఆర్‌ఎస్ గోబెల్స్ ప్రచారంతోనే  ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు  ఓడించారని మంత్రి  తెలిపారు. రాష్ట్రాభివృద్ధిని అన్ని ప్రభుత్వాలు కొనసాగించాయని, తమ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అన్నారు. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా బుధవారం గాంధీభవన్‌లో ప్రజల నుంచి మంత్రి అర్జీలను స్వీకరించారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రజల నుంచి 212 వరకు దరఖాస్తులు వచ్చాయి.

డబుల్‌బెడ్ రూమ్స్, వాటర్ వర్క్స్, మున్సిపల్‌కు సంబంధించిన అర్జీలతో పాటు దేవాలయాల అభివృద్ధి, పెండింగ్ బిల్లులు మంజూరు, భూమి సమస్యలు, వృధ్యాప్య, ఒంటరి మహిళల పెన్షన్లు, రెవెన్యూ, ఐటీ జాబ్స్ కొరకు సంబంధించిన దరఖాస్తులున్నాయి. వీటిపైన మంత్రి శ్రీధర్‌బాబు ఆయా శాఖలకు సంబంధించిన అధికారుకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీ పీసీసీ ఉపాధ్యక్షులు సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, పార్టీ నేతలు పాల్గొన్నారు.