calender_icon.png 15 August, 2025 | 2:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో సంఘ్ పరివార్ అడ్రస్ ఎక్కడ..?

15-08-2025 12:37:20 PM

  1. తిరంగా ర్యాలీలతో బిజెపి నేతలు దేశభక్తిని ప్రదర్శించడం శోచనీయం.
  2. దేశ పౌరులకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను బిజెపి కాలరాస్తోంది.
  3. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్. 

కరీంనగర్,(విజయక్రాంతి): దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్( Sangh Parivar) అడ్రస్ ఎక్కడ కూడా కనిపించదని, బిజెపి నేతలు ప్రస్తుత పరిస్థితుల్లో తిరంగా ర్యాలీలతో, మహనీయుల విగ్రహాల శుద్ధి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశభక్తిని ప్రదర్శించడం శోచనీయమని, దేశానికి స్వాతంత్రం సిద్ధించి 79సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ దేశంలో పేదల బ్రతుకులు మారలేదని ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ విమర్శించారు. శుక్రవారం నగరంలోని ఎంఐఎం కార్యాలయం దారుస్సలామ్ లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ దారుస్సలాంలో జాతీయ జెండా ఆవిష్కరించి, జాతీయ గీతం ఆలపించి, స్వీట్లు పంచారు.

ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నాగపూర్ లో ఎప్పుడు  జాతీయ జెండా ఎగురవేయలేదని, ఎంఐఎం పార్టీ దేశంలో విస్తృతంగా బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలో బలోపేతం అవుతున్న పరిస్థితిని చూసి ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో  జాతీయ జెండాను ఎగరవేశారని వ్యాఖ్యానించారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఎంతోమంది ముస్లింలు తమ ప్రాణాలను ఎదురొడ్డి పోరాడి అమరులయ్యారని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి మహనీయులు రూపొందించిన రాజ్యాంగాన్ని పరిగణలోకి తీసుకోకుండా బీజేపీ ప్రభుత్వం.. సంఘ్ పరివార్ తన సొంత ఎజెండాగా మార్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

అమరుల త్యాగాల ఫలితంగా సిద్ధించినటువంటి స్వాతంత్రాన్ని, దేశ ప్రజలకు రాజ్యాంగ హక్కులు కల్పించినటువంటి గణతంత్ర్యాన్ని బిజెపి ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. బీహార్ లో ఓటర్లను తొలగించి దొడ్డిదారిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని, బిజెపి ఐడియాలజీ దేశానికి ప్రమాదకరమన్నారు. నేటికి దళితులు, ముస్లింలు దేశంలో స్వేచ్ఛ వాయువులు పీల్చుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. దేశంలో దళిత, ముస్లింలపై సాంస్కృతిక దాడి జరుగుతోందని, బిజెపి, సంఘ్ పరివార్ కుట్రలను, ముక్తకంఠంతో ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, జాయింట్ సెక్రటరీ హాఫీజ్ మొయిజుద్దీన్ ఖాద్రి, ఆతిన, ఖమరొద్దీన్, ఖాజా, కోశాధికారి ఇబ్రహీం, మాజీ కార్పొరేటర్లు ఫిరోజ్ అఖిల్, శర్ఫుద్దీన్, నాయకులు అలిబాబా, అజర్, మాజిద్ హుస్సేన్, ఫసియుద్దీన్ ఖాలీద్, మజహరోద్దీన్, వాజిద్, సాజిద్, తాజ్, కాజమ్ ఖాన్, సలీమ్ తదితరులు పాల్గొన్నారు.