26 July, 2026 | 2:14 AM

మార్క్‌ఫెడ్ మక్కలకు రక్షణేదీ!

26-07-2026 01:02 AM

కేసముద్రం మార్కెట్ ఓపెన్ షెడ్లలో 2.70 లక్షల బస్తాల మక్కల నిల్వ

చిరిగిన ప్లాస్టిక్ బస్తాలతో రక్షణ ప్రశ్నార్థకం

ధ్వంసం చేస్తున్న కోతులు

చోరీలపై అనుమానాలు 

మహబూబాబాద్, జులై 25 (విజయక్రాంతి): రైతుల నుంచి కొనుగోలు చేసిన లక్షల బస్తాల మొక్కజొన్నలకు మార్క్‌ఫెడ్ సంస్థ సరైన రక్షణ కల్పించడంలో విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో ఓపెన్ షెడ్లలో నిల్వ చేసిన మక్కలు ఒకవైపు కోతుల బారిన పడుతుండగా, మరోవైపు చోరీలకు గురవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని నిర్లక్ష్యంగా భద్రపరచడం అధికారుల తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

గత యాసంగి సీజన్‌లో జిల్లాలోని వివిధ ప్రాంతాల రైతుల నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మొక్కజొన్నలను తొలుత పెద్దపల్లి తదితర ప్రాంతాల్లోని గోదాములకు తరలించారు. గోదాములు నిండిపోవడంతో కేసముద్రం, దన్నసరి సొసైటీల పరిధిలో కొనుగోలు చేసిన సుమారు 2.70 లక్షల బస్తాల మక్కలను కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లోని ఓపెన్ షెడ్లలో నిల్వ చేశారు.

వీటి సంరక్షణ బాధ్యతను ఓ ప్రైవేటు కాంట్రాక్టర్‌కు అప్పగించారు. అయితే షెడ్లకు ఇరువైపులా ఇనుప రేకులు బిగించినప్పటికీ ముందు, వెనుక భాగాలను పూర్తిగా మూసివేయలేదు. తాత్కాలికంగా ప్లాస్టిక్ కవర్లు మాత్రమే ఏర్పాటు చేయడంతో అవి గాలికి పలుచోట్ల చిరిగిపోయాయి. కోతులు గుంపులుగా షెడ్లలోకి ప్రవేశించి బస్తాలను చింపి మక్కలను తింటున్నాయి.  

23 మక్కల బస్తాలు ఎక్కడివి?

ఇదిలా ఉండగా, ఓపెన్ షెడ్లలో నిల్వ చేసిన మక్కలలో కొంత భాగం చోరీకి గురవుతోందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం వ్యవసాయ మార్కెట్‌లో అనుమానాస్పదంగా మక్కల విక్రయం జరుగుతున్నట్లు గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది నిఘా ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న వ్యక్తులు అక్కడే 23 బస్తాల మొక్కజొన్నలను వదిలేసి పరారైనట్లు సమాచారం. అనంతరం మార్కెట్ సిబ్బంది వాటిని స్వాధీనం చేసుకుని తిరిగి నిల్వ చేశారు. ఇవి మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన మక్కలేనని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కాంట్రాక్టర్‌కు సమాచారం అందించగా, పోలీసులు విచారణ చేపట్టారు. అయితే నిల్వలో ఉన్న బస్తాల పూర్తి లెక్కలు తేలకపోవడంతో చోరీ జరిగిన పరిమాణంపై స్పష్టత రావడం లేదు.

పటిష్ట భద్రతే పరిష్కారం

లక్షల బస్తాల మొక్కజొన్నలను రక్షించేందుకు మార్క్‌ఫెడ్ వెంటనే ప్రత్యేక చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. కోతులు లోపలికి రాకుండా షెడ్లకు ఇనుప జాలీలు ఏర్పాటు చేయడం, చిరిగిపోయిన ప్లాస్టిక్ కవర్ల స్థానంలో శాశ్వత రక్షణ కల్పించడం, ప్రతి షెడ్డు వద్ద అదనపు భద్రతా సిబ్బందిని నియమించడం, సీసీ కెమెరాల నిఘా పెంచడం ద్వారా ప్రభుత్వ ధాన్యాన్ని కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.