7 July, 2026 | 2:41 AM

చేతగాకపోతే కేసీఆర్‌కు అప్పగించండి

07-07-2026 02:18 AM

వారం రోజుల్లో నీరు పారించి చూపిస్తారు

ఏమైనా ప్రమాదం జరిగితే బీఆర్‌ఎస్‌దే బాధ్యత

చంద్రబాబు కోసం రేవంత్‌రెడ్డి నాటకం

బ్యారేజీల నుంచి ఇసుక తవ్వి వేల కోట్ల దోపిడీ

నీళ్లు ఎత్తిపోయకపోతే చలో కన్నెపల్లి, ఎల్లంపల్లి

మాజీ మంత్రులు జగదీష్‌రెడ్డి, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): కన్నేపల్లి పంప్‌హౌస్‌లో మోటార్లు ప్రారంభించి 150 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉన్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని, చేతగాకపోతే కేసీఆర్‌కు అప్పగిస్తే వారం రోజుల్లో మొత్తం నీరు పారించి చూపిస్తారని మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ తెలిపారు.

మంత్రి ఉత్తమ్ చెప్తున్నట్లు ఏమైనా ప్రమాదం జరిగితే బీఆర్‌ఎస్ బాధ్యత తీసుకుంటుందన్నారు. బీఆర్‌ఎస్‌ను రద్దు చేస్తాం, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటామని సవాల్ చేశారు. మంత్రి ఉత్తమ్ అడిగినా... క్యాబినెట్ అడిగినా తెలంగాణ ప్రజల తరఫున కేసీఆర్ అండర్ టేకింగ్ ఇస్తారని స్పష్టం చేశారు.

ఇదంతా చంద్రబాబు కోసం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గం ఆడుతున్న నాటకం మాత్రమేనని, ఎన్డీఎస్‌ఏకు ఏ మాత్రం సంబంధం లేదన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రు లు జగదీశ్‌రెడ్డి, కమలాకర్, వినోద్‌కుమార్ మాట్లాడారు. ఎస్‌ఎల్‌బీసీ విషయంలో  సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ జైలుకు పోవాలన్నారు. ఏడాది నుంచి మోటార్లను కనీసం ప్రారంభం చేయలేదని ఇంజనీర్లు చెప్తున్నారని పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్‌కు ఏమీ తెలియదు... ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.

శ్రీధర్‌బాబు లాంటి వాళ్లు కూడా పదవీ భయంతో రేవంత్‌రెడ్డి అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని, మంత్రు లు తెలంగాణ ఆత్మను కోల్పోయారని విమర్శించారు. తెలంగాణ భూములను కాపాడేందుకు కన్నేపల్లి సిద్ధంగా ఉందని కేటీఆర్ అందరికీ కళ్లకు కట్టినట్లు చూపారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశించామని, స్పందించిన నలుగురు మంత్రులు మళ్లీ సొల్లు పురాణం తప్ప తెలంగాణ సోయితో మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష కాదు పది రూపాయల అవినీతిని కూడా తీయలేకపోయారని, ప్రభుత్వం వేసిన కమిషన్‌ను కోర్టు చెత్త బుట్టలో పడేసిందన్నారు.

ఎల్‌నినో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం ఎంతైనా ఉందని, కేసీఆర్ అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిన ఉద్దేశం ఇదే అని స్పష్టం చేశారు. బ్యారేజీల నుంచి ఇసుక తవ్వి వేల కోట్లు దండుకుంటున్నారని, విద్యుత్ బిల్లులకు భయపడి, రైతుల పంట కొనాల్సి వస్తుందని, బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం పంపులు నడపడం లేదని ఆరోపించారు. ప్రజలకు అన్ని విషయాలు అర్థం అవుతున్నాయని, సమయం వచ్చినపుడు తగిన నిర్ణయం తీసుకుంటారని హెచ్చరించారు. 

నీళ్లు ఎత్తిపోయకపోతే చలో కన్నెపల్లి, ఎల్లంపల్లి 

కన్నేపల్లి వద్ద నీళ్లు ఎత్తిపోయకపోతే చలో కన్నేపల్లి, ఎల్లంపల్లి పిలుపునిస్తామని మాజీ మంత్రులు, మాజీ ఎంపీ వెల్లడించారు. చిన్నచిన్న అంశాలు ఉంటే మరమ్మతు చేయాలని ఎన్డీఎస్‌ఏ సూచించిందని, భయపడి జలాశయాలు నింపకుండా ఉంటారా? అని ప్రశ్నించారు. భద్రాచలం కొట్టుకు పోతుందని ఉత్తమ్ అంటున్నారు... రేవంత్‌రెడ్డి చెప్పమన్నారా అని ఎద్దేవా చేశారు. 2021లో భారీ వరదతో 29 లక్షల క్యూసెక్కుల ప్రవాహం.. 250 టీఎంసీల నీరు వెళ్లినా భద్రాచలంకు ఏమీ కాలేదని గుర్తు చేశారు.

మంత్రులకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏబీసీడీలు కూడా తెలియదని విమర్శిం చారు. ఎల్ నినో వచ్చింది.. నీరు నింపుతామని మంత్రి ఉత్తమ్ ఒక్కసారి అయినా ఎన్డీఎస్‌ఏతో మాట్లాడారా?, 16 మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఒక్కరోజైనా దీని గురించి ఆలోచించారా? అని నిలదీశారు. ఇప్పటికైనా ఇసుక లారీలు బంద్ చేసి, కన్నేపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి తరలించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లా మంత్రులు చొరవ తీసుకుని సీఎంతో మాట్లాడి నీటిని ఎత్తిపోసేలా చూడాలని సూచించారు.