భరోసా లేని ఉద్యోగి జీవితం!
రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంలో అత్యంత కీలకమైన భాగం ప్రభుత్వ ఉద్యోగులు. ప్రభుత్వాలు మారినా, విధానాలు మారినా క్షేత్రస్థాయిలో ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల చెంతకు చేర్చి, వ్యవస్థను సజావుగా నడిపించేది వీరే. అయితే, నేడు అదే ఉద్యోగ వర్గంలో ఒక పెద్ద విభాగమైన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులు తీవ్రమైన అభద్రతా భావంతో, నిరాశా నిస్పృహల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు.
పాత పెన్షన్ విధానం స్థానంలో వచ్చిన ఈ సీపీఎస్ విధానం నేడు ఉద్యోగుల పాలిట శాపంగా మారిందనేది జగమెరిగిన సత్యం. పదవీ విరమణ తర్వాతి జీవితమే కాదు, ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా వారు ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉద్యోగికి పెరిగే మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రభుత్వం అందించే కరువు భత్యం అనేది విలాసవంతమైన అలవెన్స్ కాదు. అది నిత్య జీవన వ్యయాన్ని తట్టుకోవడానికి ఉద్యోగికి ఉండే ఒక హక్కు. కానీ, నేడు సీపీఎస్ ఉద్యోగికి ప్రభుత్వం ఏకంగా 33 నెలల డీఏ ఏరియర్స్ బాకీ పడటం ఏ రకమైన న్యాయమో పాలకులు ఆలోచించాలి.
మొత్తంగా ఒక్కొక్క ఉద్యోగికి సగటున రూ.1,25,000 నుంచి రావాల్సి ఉంది. ఇది కేవలం బడ్జెట్ అంకెల్లో కనిపించే మొత్తం కాదు. ఒక మధ్యతరగతి ఉద్యోగి కుటుంబ అవసరాలు, పిల్లల స్కూల్ ఫీజులు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల మందుల ఖర్చులు, ఇంటి అద్దె, ఈఎంఐలతో ముడిపడి ఉన్న సొమ్ము. నెలల తరబడి కష్టపడి పనిచేసినా, రావలసిన భత్యాలు సకాలంలో అందకపోవడంతో ఉద్యోగులు బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సి వస్తోంది.
మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుంటే, జీతంలో భాగమైన డీఏ బకాయిలను ప్రభుత్వం ఏళ్ల తరబడి తన వద్దే ఉంచుకోవడం ఉద్యోగుల పొట్టకొట్టడమే అవుతుంది. సకాలంలో డీఏ ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగి నిరంతరం ఆర్థిక, మానసిక ఆందోళనకు గురవుతున్నాడు.
ఉద్యోగుల ఆరోగ్య రక్షణ కోసం ఉద్దేశించిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు తీరు సీపీఎస్ ఉద్యోగుల విషయంలో పారదర్శకత లేకుండా సాగుతోంది. ప్రతి నెలా ఉద్యోగి జీతం రాకపోయినా, డీఏలు ఆలస్యమైనా.. జీతం నుంచి క్రమం తప్పకుండా 1.5 శాతం సొమ్మును ప్రభుత్వం ఈహెచ్‌ఎస్ కింద కట్ చేస్తోంది.
కానీ భవిష్యత్తులో ఈహెచ్‌ఎస్ కార్డులు పట్టుకుని కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తే, ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదనే నెపంతో నెట్‌వర్క్ ఆసుపత్రులు ఉచిత వైద్యం నిరాకరిస్తాయేమో అనే భయం వెంటాడుతూనే ఉంది. ఇక అత్యంత క్రూరమైన మరొక అంశం ఏంటంటే ఉద్యోగంలో ఉన్నంత కాలం జీతంలో కోతలు భరిస్తూ, రక్తం ధారపోసిన ఈ సీపీఎస్ ఉద్యోగికి, పదవీ విరమణ చేసిన తర్వాత ఎలాంటి వైద్య భరోసా ఉండదు. మానవ జీవితంలో వైద్య సాయం, ఆరోగ్య రక్షణ అత్యంత అవసరమయ్యేది వృద్ధాప్యంలోనే.
వయసు మళ్లిన తర్వాతి కాలంలో రోగాలు చుట్టుముడతాయి. చేతిలో పెన్షన్ ఉండదు, పోనీ ఆరోగ్యానికైనా గ్యారెంటీ ఉందా అంటే అదీ లేదు. మరి ఉద్యోగ కాలంలో కట్ చేసిన 1.5% సొమ్ముకు ప్రభుత్వం ఇచ్చే విలువ ఇదేనా? వృద్ధాప్యంలో రోగాలబారిన పడితే ప్రైవేట్ ఆసుపత్రులకు లక్షలు ఎలా చెల్లించాలో తెలియక ఉద్యోగుల గుండె లయ తప్పుతుంది.
ప్రతిభావంతులైన యువత కార్పొరేట్ ఉద్యోగాల వైపు వెళ్లకుండా తక్కువ జీతమైనా ప్రభుత్వ ఉద్యోగం వైపు మొగ్గుచూపడానికి ప్రధాన కారణం ఉద్యోగ భద్రతతో పాటు వృద్ధాప్యంలో ఆసరాగా నిలిచే ‘పెన్షన్’. కానీ సీపీఎస్ ఉద్యోగుల జీవితంలో అది ఒక ఎండమావిలా మారింది. పాత పెన్షన్ విధానంలో పదవీ విరమణ పొందిన తర్వాత చివరి జీతంలో సగం మొత్తం పెన్షన్‌గా వచ్చేది. దీనివల్ల సమాజంలో, సొంత కుటుంబంలో వారికి గౌరవం, ఆర్థిక స్వాతంత్య్రం ఉండేవి.
కానీ సీపీఎస్ విధానంలో మార్కెట్ హెచ్చుతగ్గులపై, షేర్ మార్కెట్ బాండ్లపై ఆధారపడి ఇచ్చే అరకొర పెన్షన్ కనీసం నెలకు ఒకరి మందుల ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. ఎన్నో ఏళ్లపాటు రక్తాన్ని చెమటగా మార్చి సేవలు అందించి, వృద్ధాప్యంలోకి అడుగుపెట్టేసరికి చేతిలో స్థిరమైన పెన్షన్ లేకపోవడం కంటే దారుణం మరొకటి ఉండదు.
ప్రభుత్వ పెద్దలు తాత్కాలిక ఉపశమనాలతో కాలయాపన చేయకుండా, క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న వేదను గమనించాలి. సీపీఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి. నానాటికి పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు, ఉద్యోగులకు రావాల్సిన 33 నెలల డీఏ ఏరియర్స్ మొత్తాన్ని (రూ. 1.25 లక్షలు) ఎలాంటి కాలయాపన లేకుండా తక్షణమే విడుదల చేయాలి.
సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగుల కుటుంబాలు వృద్ధాప్యంలో రోడ్డునపడే పరిస్థితి రాకముందే, వారికి సామాజిక భద్రత కల్పించేలా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. ఉద్యోగ జీవితంలో 1.5% హెల్త్ కాంట్రిబ్యూషన్ నిరంతరం తీసుకుంటున్నందున, రిటైర్మెంట్ తర్వాత కూడా వారికి,
వారి జీవిత భాగస్వామికి ఉచిత నాణ్యమైన వైద్య సేవలు అందేలా ఈహెచ్‌ఎస్ పరిధిని చట్టబద్ధం చేయాలి. ఉద్యోగుల కనీస హక్కులను నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు సీపీఎస్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తారని, వారి వృద్ధాప్య జీవితాలకు భరోసానిస్తారని ఆశిద్దాం.
వ్యాసకర్త: తెలంగాణ టీచర్స్ యూనియన్ ప్రతినిధి, 9494019270






