అక్కలబస్తీ ప్రజలకు దిక్కెవరు!
బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాములు
రామాయంపేట, జూలై 28: రామాయంపేట పట్టణంలోని 11వ వార్డు అక్కలబస్తీలో గత రెండేళ్లుగా ప్రజలు అత్యంత దయనీయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారని, వర్షాకాలం వస్తే ప్రతి ఇంటిలోకి వరద నీరు చేరి ప్రజల ప్రాణాలు, ఆస్తులు ప్రమాదంలో పడుతున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, మెదక్ జిల్లా నాయకులు రాగి రాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు అక్కలబస్తీలోని దాదాపు అన్ని ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ సమస్యపై బస్తీ ప్రజలు అనేకసార్లు మున్సిపల్ అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం చూపకపోవడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.
అక్కలబస్తీ నుంచి బయటకు వెళ్లాల్సిన వర్షపు నీటి ప్రవాహాన్ని టెక్నికల్ లోపాలతో నిర్మించిన బ్రిడ్జి అడ్డుకుంటోందని, ఫలితంగా నీరు బయటకు వెళ్లే మార్గం లేక మొత్తం బస్తీ చెరువును తలపించేలా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే సాంకేతిక లోపాలను సరిదిద్ది, నీరు నిరంతరంగా బయటకు వెళ్లే విధంగా శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్య వైఖరిని వీడి అక్కలబస్తీ సమస్యను అత్యవసరంగా పరిగణించి, టెక్నికల్ లోపాలతో నిర్మించిన బ్రిడ్జిని సరిచేసి, శాశ్వత డ్రైనేజీ పరిష్కారం అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.






