15 August, 2026 | 2:01 AM

స్వాతంత్య్ర ఫలాలు దక్కిందెవరికి?

15-08-2026 12:00 AM

టి.చిరంజీవులు :

నేడు స్వాతంత్య్ర దినోత్సవం :

స్వాతంత్య్రం వచ్చిందని సంబరపడటమేనా? నేటి భారతం మనల్ని అడుగుతున్న ప్రశ్న ఇది. ‘పాడవోయి భారతీయుడా ఆడిపాడవోయి భారతీయుడా, స్వాతంత్రం వచ్చిందని సభలే చేసి సంబరపడిపోతే సరిపోదోయ్...’ --- 1961లో వచ్చిన వెలుగు నీడలు సినిమాలోని ఈ పాట నాటి భారతదేశానికి చెప్పిన సందేశం. దాదాపు 65 ఏళ్ల తరువాత కూడా ఆ మాటలు మనల్ని ఆలోచింపజేస్తున్నాయి.

1947లో స్వాతంత్య్రం సాధించి 79 ఏళ్లు పూర్తిచేసుకున్న భారతదేశం నేడు ఎక్కడ ఉంది? ఏమి సాధించింది? ఇంకా ఏమి సాధించాల్సి ఉంది? అయితే, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు ఒక విషయాన్ని ముందుగా మనం అంగీకరించాలి. 

స్వాతంత్య్రం వచ్చిన నాటి భారతదేశంతో పోలిస్తే, నేటి భారత్ సాధించిన ప్రగతి అసాధారణమైనది. అప్పట్లో ఆహార కొరత, నిరక్షరాస్యత, పేదరికం, పారిశ్రామిక వెనుకబాటుతనం వంటి ఎన్నో సమస్యలతో ప్రారంభమైన దేశం నేడు ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక శక్తుల్లో ఒకటిగా ఎదిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్షం, ఐటీ, ఫార్మా, మౌలిక వసతులు, డిజిటల్ టెక్నాలజీ వంటి అనేక రంగాల్లో ప్రపంచ స్థాయికి చేరుకుంది.

ఊహించని స్థాయిలో నేడు భారతదేశం అంతరిక్ష రం గంలో తన సత్తాను చాటుతోంది. 2017లో ఇస్రో ఒకే ప్రయోగంలో 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. ఒకప్పుడు విదేశాల నుంచి ఆహార ధాన్యాల కోసం ఎదురుచూసిన దేశం నేడు ప్రపంచంలోని ప్రధాన ఆహార ఉత్పత్తిదారుల్లో ఒకటిగా నిలిచింది. 

అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. దేశం అభివృద్ధి చెందిందా?--- అవును. ఆ అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికీ సమానంగా అందాయా? అదే మనం ప్రశ్నించాల్సిన విషయం.

మానవాభివృద్ధి ఎక్కడ?

ఆర్థిక వృద్ధిని కొలవడానికి జీడీపీ ఒక ముఖ్యమైన సూచీ. నేడు 4.2 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ మనది. కానీ, జీడీపీ ఒక్కటే ప్రజల జీవన ప్రమాణాన్ని చెప్పదు. యూఎన్‌డీపీ-2025 హ్యూమన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రకారం, 193 దేశాల్లో భారతదేశం మానవాభివృద్ధి సూచీలో 130వ స్థానంలో ఉంది.

అంటే ఆర్థికంగా ముందుకు వెళ్తున్నప్పటికీ, ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు వంటి మానవాభివృద్ధి అంశాల్లో మన ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. జీడీపీ ఒక దేశం ఎంత సంపద సృష్టించిందో చెబుతుం ది. మానవాభివృద్ధి సూచీ ఆ సంపద ప్రజల జీవితాలను ఎంతవరకు మార్చిందో ప్రశ్నిస్తుంది. ఇదే భారత అభివృద్ధిపై మనం వేసుకోవాల్సిన అసలు ప్రశ్న.

2025 ప్రపంచ ఆకలి సూచీ ప్రకారం 123 దేశాల్లో భారత్ 102వ స్థానంలో ఉంది. భారతదేశ హంగర్ ఇండెక్స్ స్కోర్ 25.8గా ఉండగా, పరిస్థితిని ‘సీరియస్’గా వర్గీకరించింది. అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపగలిగే సాంకేతిక సామర్థ్యం ఉన్న దేశంలోనే పిల్లల్లో పోషకాహార లోపం, ఆకలి, శిశు పోషణ సమస్యలు ఇంకా ఉండటం మన అభివృద్ధి నవనాను ప్రశ్నించే అంశం. ఉపగ్రహాలను ఆకాశంలోకి పంపగలిగిన దేశం ఆకలిని మాత్రం భూమిపై ఎందుకు పూర్తిగా జయించలేకపోతోంది?

ఇంకా పూర్తిగా తగ్గని పేదరికం

భారతదేశంలో పేదరికం తగ్గిందనేది నిజం. ప్రపంచ బ్యాంకు తాజా అంచనాల ప్రకారం 2023లో రోజుకు 3 డాలర్ల అంతర్జాతీయ తీవ్రమైన పేదరికం ప్రమాణం కింద సుమారు 3.7 కోట్ల మంది ఉన్నారు. రోజుకు 4.20 డాలర్ల ప్రమాణాన్ని తీసుకుంటే సుమారు 23.3 కోట్ల మంది ఆ స్థాయికి దిగువన ఉన్నారు. ఈ పేదలలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారే.

వారి సంప్రదాయ చేతివృత్తులు ధ్వంసమై ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లేక ప్రభుత్వ రాయితీల మీద ఆధారపడి జీవనాలు కొనసాగిస్తున్నారు. అందువల్ల ‘భారతదేశంలో పేదరికం తగ్గలేదు’ అనడం వాస్తవానికి సరైనది కాదు. కానీ ‘పేదరికం పూర్తిగా అంతమైపోయింది’ అనడం కూడా అంతే తప్పు. పేదరికం తగ్గడం విజయమే; పేదరికం లేకుండా చేయడం ఇంకా మిగిలిన బాధ్యత. 

సంపద పంపిణీలో అసమానత్వం

ఇదే సమయంలో భారతదేశంలో అపారమైన సంపద కేంద్రీకృతమవుతోంది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 ప్రకారం భారత్‌లో 308 మంది బిలియనీర్లు ఉన్నారు. అమెరికా, చైనా తరువాత బిలియనీర్ల సంఖ్య లో భారత్ మూడో స్థానంలో ఉంది. ఇది భారతదేశం సంపద సృష్టించే సామర్థ్యానికి ఒక సంకేతం. కానీ, అదే సమయంలో ఒక ప్రశ్న కూడా ఉదయిస్తున్నది: ఈ సంపద సృష్టిలో సమాజంలోని అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు లభిస్తున్నాయా? ఒకవైపు ప్రపంచ స్థాయి బిలియనీర్లు పెరుగుతుండగా, మరోవైపు కోట్లాది ప్రజలు తక్కువ ఆదాయం, అస్థిర ఉపాధి, పోషకాహార లోపం, విద్య అందకపోవడం, అనారోగ్య సమస్యలతో జీవిస్తుంటే, ఆర్థిక వృద్ధి ఎంతవరకు సమగ్రంగా ఉందో ఆలోచించాల్సిందే.

పెరుగుతున్న రుణభారం

దేశ ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వ రుణం కొంతవరకు అవసరమే. మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, సంక్షేమం కోసం ప్రభుత్వం అప్పులు చేయవచ్చు. కానీ రుణం ఉత్పాదక పెట్టుబడిగా మారి భవిష్యత్తులో ఆదాయం, ఉపాధి, సంపదను సృష్టించాలి. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను కలిపిన భారత ప్రభుత్వాల సమిష్టి రుణభారం జీడీపీలో దాదాపు 81 శాతంగా ఉంది.

ప్రస్తుత పరిమాణాన్ని జనాభాతో సాధారణంగా భాగిస్తే, సగటున ఒక్కో భారతీయుడి మీద దాదాపు రూ.2 లక్షల మేరకు ప్రభుత్వ రుణభారం ఉంది. ఇది వ్యక్తిగత అప్పు కాదు; ప్రభుత్వ రుణాన్ని జనాభాతో భాగించిన గణాంకం మాత్రమే. అందుకే ప్రశ్న కేవలం ‘ఎంత అప్పు ఉంది?’ అనేది కాదు.

‘ఆ అప్పుతో మనం ఏ ఆస్తులను సృష్టిస్తున్నాం? ఎన్ని ఉద్యోగాలను సృష్టిస్తున్నాం? భవిష్యత్ తరాలకు ఎంత బలమైన ఆర్థిక వ్యవస్థను అందిస్తున్నాం?’ అనేదే అసలు ప్రశ్న. 2025---26 ప్రాంతంలో నామినల్ జీడీపీ పర్ క్యాపిటా ఆధారంగా భారత్ ప్రపంచంలో సుమారు 140వ స్థానంలో ఉంది. పీపీపీ (కొనుగోలు శక్తి సమానత్వం) ఆధారంగా చూస్తే భారత్ సుమారు 125వ స్థానంలో ఉంటుంది.

క్రోనీ క్యాపిటలిజం అవరోధమా?

భారతదేశంలో సంపద సృష్టించే పారిశ్రామికవేత్తలను వ్యతిరేకించడం పరిష్కారం కాదు. పెట్టుబడి, పరిశ్రమ, వ్యాపారం, ఆవిష్కరణలు దేశాభివృద్ధికి అవసరం. కానీ మార్కెట్ పోటీకి బదులుగా రాజకీయ పలుకుబడి, ప్రభుత్వ అనుమతులు, విధానపరమైన ప్రత్యేక ప్రయోజనాలు, కాంట్రాక్టులు లేదా అధికారంతో సన్నిహిత సంబంధాలు కొంతమందికి అసాధారణ ప్రయోజనాలు కల్పించే పరిస్థితి ఏర్పడితే దాన్ని క్రోనీ క్యాపిటలిజం అంటారు.

మన ఆర్థిక వ్యవస్థలో విజయం ప్రతిభ, పోటీ, ఉత్పాదకత ఆధారంగా వస్తుందా? లేక రాజకీయ- వ్యాపార సంబంధాలు కూడా సంపద పంపిణీలో అసమాన ప్రభావం చూపుతున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం పారదర్శకమైన పాలన, సమాన అవకాశాలు, బలమైన నియంత్రణ వ్యవస్థ, స్వతంత్ర సంస్థలు, ఆరోగ్యకరమైన పోటీ ద్వారా రావాలి. 

భారతదేశానికి ఉన్న అతిపెద్ద బలం దాని యువ జనాభా. ప్రపంచంలోని అనేక దేశాలు వృద్ధాప్య సమాజాలుగా మారుతున్న సమయంలో భారత్‌లో పెద్ద సంఖ్యలో యువత ఉన్నారు. ఇది మనకు అపూర్వమైన డెమోగ్రాఫిక్ డివిడెండ్. కానీ, యువతకు సరైన విద్య, నైపుణ్యాలు, ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు కల్పించగలిగితేనే అది డెమోగ్రాఫిక్ డివిడెండ్ అవుతుంది. లేకపోతే అదే యువ జనాభా నిరుద్యోగం, నిరాశ, సామాజిక అసంతృప్తికి కారణమయ్యే ప్రమాదం ఉంది.

ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువత ఉద్యోగ మార్కెట్‌లోకి వస్తున్నారు. వారికి సరిపోయే స్థాయిలో నాణ్యమైన, స్థిరమైన, గౌరవప్రదమైన ఉద్యోగాలు సృష్టించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మన అభివృద్ధి విధానంలో ఒక మార్పు అత్యవసరం: జీడీపీ గ్రోత్ మాత్రమే కాదు, జాబ్ గ్రోత్ కావాలి.

అంటే పెట్టుబడులు పెరగాలి, పరిశ్రమలు పెరగాలి, వాటితో పాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కూడా రావాలి. ముఖ్యంగా తయారీ రంగం, ఎంఎస్‌ఎంఈలు, సేవా రంగం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఆధునిక మౌలిక వసతులు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఉపాధి అవకాశాలను విస్తరించాలి. యువత చేతిలో డిగ్రీ ఉండి, చేతిలో ఉద్యోగం లేకపోతే ఆర్థిక వృద్ధి ఎంత అర్థవంతం?

1947లో మనం వలస పాలన నుంచి రాజకీయ స్వాతంత్య్రం పొందాం. కానీ 2026 భారతదేశానికి విలువలపై ఆధారపడి సమాన అవకాశాలు కల్పించే మరో రకమైన స్వాతంత్య్రం అవసరం. పేదరికం నుంచి స్వాతంత్య్రం. ఆకలి నుంచి స్వాతంత్య్రం. నిరుద్యోగం నుంచి స్వాతంత్య్రం. ఉచిత నాణ్యమైన విద్య, వైద్యం అందించే స్వాతంత్య్రం. సామాజిక వివక్ష నుంచి విముక్తి కల్పించే స్వాతంత్య్రం. అవకాశాల అసమానత నుంచి స్వాతంత్య్రం. స్వాతంత్య్రం అంటే కేవలం జెండా ఎగరవేయడం కాదు. ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే అవకాశం కల్పించడమే స్వాతంత్య్రానికి నిజమైన అర్థం.

 మన పయనమెటు?

భారతదేశం ఇప్పటివరకు సాధించిన ప్రగతిని తిరస్కరించాల్సిన అవసరం లేదు. మన కంటే అత్యంత వెనుకబడిన దేశాలైన చైనా, దక్షిణ కొరియా లాంటివి మన కంటే ఎంతో అభివృద్ధి చెందాయి. భారత్ మరింత శీఘ్రంగా అభివృద్ధి చెందాలి. తీవ్రమైన ఆర్థిక అసమానతలు తగ్గాలి. సంపద వికేంద్రీకరణ జరగాలి.  దాన్ని మరింత సమగ్రంగా చేయాల్సిన అవసరం ఉంది.

వేగవంతమైన ఆర్థిక వృద్ధి, నాణ్యమైన ఉపాధి, సమాన అవకాశాలు, మానవాభివృద్ధి, సామాజిక న్యాయం- కలిస్తేనే నిజమైన అభివృద్ధి. సమగ్రాభివృద్ధి చెందిన భారతదేశం అంటే కేవలం ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశం కాదు. ప్రపంచంలో అత్యంత గౌరవప్రదమైన జీవితం గడిపే పౌరులు ఉన్న దేశం కావాలి.

1961లో వచ్చిన ఆ పాట మనకు వేసిన ప్రశ్న 2026లో కూడా మారలేదు: ‘స్వాతంత్య్రం వచ్చిందని సభలే చేసి సంబరపడితే సరిపోదు...’ స్వాతంత్య్రం మనకు రాజకీయ హక్కును ఇచ్చింది. ఇప్పుడు ఆ స్వాతంత్య్రాన్ని ఆర్థిక న్యాయం, సామాజిక సమానత్వం, మానవ గౌరవంగా మార్చడం మన తరం బాధ్యత. భారతదేశం అభివృద్ధి చెందింది- ఇది మన గర్వం. ఆ అభివృద్ధి ప్రతి భారతీయుడికి అందాలి- ఇది మన లక్ష్యం. జై హింద్!

 వ్యాసకర్త: విశ్రాంత ఐఏఎస్, 

బీసీ ఇంటెలెక్చువల్ ఫోరమ్ చైర్మన్