ఆధ్యాత్మిక శిఖరం!
ఆచార్య మసన చెన్నప్ప :
మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి రచనలను, ముఖ్యంగా ‘కృష్ణప క్షం’లోని ‘అన్వేషణ’ అనే కవితాఖండికను చదివినప్పుడు, ఆయన మీద ఎవరో ఒక ఆధ్యాత్మిక గురువు ప్రభావం ఉందని నాకనిపించింది. ఈ విషయంపై కొంచెం పరిశోధన చేసిన తర్వాత కృష్ణశాస్త్రికి ఆర్య సామాజికులైన ఆదిపూడి సోమనాథరావు విద్యాగురువని తెలిసింది.
లోకంలో ఏ విద్యకైనా ఒక గురువుండాలి. ముఖ్యంగా ఆధ్యాత్మిక క్షేత్రంలో నిలదొక్కుకోవాలంటే గురువు అవసరం ఎంతైనా ఉంటుంది. అన్వేషణలో కృష్ణశాస్త్రి తానొక గోపికగా మారి శ్రీకృష్ణుణ్ని అన్వేషిస్తున్న తీరు మనోహరమైంది. అయితే, నిజంగా కవి శ్రీకృష్ణుణ్ని వెదుకు తున్నారా? లేక అంతర్యామిని అన్వేషిస్తున్నారా? అని ప్రశ్నించుకుంటే కృష్ణుని రూపంలో సర్వాంతర్యామి అయిన పరమాత్మను అన్వేసిస్తున్నట్లు అర్థమైంది నాకు. అంతా భగవంతుడే అనేది పౌరాణికులకిష్టమైన మాట. అంతటా భగవంతుడే అనేది సనాతన వైదికులకిష్టమైన మాట!
ఆదిపూడి రచించిన కీర్తనలు ఆర్య సమాజాలలో గళమెత్తి గానం చేస్తారు. వాటిని ఒకటి రెండింటిని విన్న నేను వారి రచనలను పరిశీలిస్తే బాగుండుననిపించింది. అదృష్టవశాత్తు గుంటూరు వాస్త వ్యులైన బ్రహ్మశ్రీ చిర్రావూరి సుబ్బయ్యాచారి గారు నాకు ఆదిపూడి సోమనాథరావు గారి ‘ప్రబోధ శతకం’ పంపించారు నా కోరిక మేరకు. ప్రబోధ శతకంలోనివి అన్నీ పద్యాలే. కానీ దానితో పాటు పంపిన ‘భక్త కర్ణామృతము’ కేవలం భక్తులకే కాదు జ్ఞానపిపాసులకు కర్ణరసాయనమనక తప్పదు.
ఇందులో 54 కీర్తనలున్నాయి. ఇవన్నీ అంతర్యామి నిరాకార పరబ్రహ్మను వర్ణిస్తున్నవే. వీటిలో ఎక్కడా వేద విరుద్ధమైన అంశాలు లేవు. వేద సిద్ధాంతాన్ని ఆపోశనం పట్టిన ఆదిపూడి అంతర్యామిని కొలిచిన తీరు అద్భుతం. ఈ కవి వలె తెలుగులో ఇంత వరకు వేదానుకూలంగా పరమాత్మను స్తుతించిన వారు లేరని ఒక అభిప్రా యం ఉంది. సామాన్యంగా తెలుగు కవులకు దేవుడంటే నిర్గుణ నిరాకార పరబ్రహ్మ కాడు, అతడు తప్పకుండా అవతార పురుషుడై ఉండాలి.
లేదా లక్ష్మీదేవి భర్త అయిన విష్ణువో, సరస్వతీదేవి భర్త అయిన బ్రహ్మనో, పార్వతీదేవి భర్త అయిన శివుడో కావాలి. లేదా వినాయ కుడో, కుమారస్వామియో, రాముడో, కృష్ణుడో, వేంకటేశ్వరుడో, చివరికి అయ్యప్పనో, కాకపోతే సాయిబాబానో కావాలి. చావుపుట్టుకలు లేనివాడు, ఆకారం లేనివాడు, సర్వవ్యాపకుడు, సచ్చిదానంద మూర్తి అయిన పరమాత్మ ఆదిపూడికి ఆరాధ్యుడన్న విషయం తెలిసి, నా అంతరంగం ఆనందరసతరంగితమైంది.
కొందరు పండితులు సత్యాన్ని దాచిపెట్టారు. అంతా పరబ్రహ్మమే అంటారు కానీ, తోటి జీవులను లెక్కపెట్టరు. ఎదుటివారెంత మూర్ఖులుగా ఉంటే తామంత గొప్ప వారమవుతామని ఆ పండితుల అభిప్రాయమేమో! వేదం దేవుడొక్కడేనని చెప్తుంటే, పండితులు ఎంతోమంది దేవుళ్లను సృష్టించారు. దేవుడు లోకలోకాలను సృష్టిస్తే, పండితులు దేవుళ్లను సృష్టించారు. జడచేతన దేవతలకు భేదం తెలియని వాళ్లంతా ఆధ్యాత్మికవేత్తలే అయ్యారు.
కానీ, ఒకరు చెప్పినదానికి, మరొకరు చెప్పిన దానికి పొసగదు. సత్యం తెలియకపోవడం వల్లనే సంప్రదాయాలు, వాదాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొని వచ్చినట్లనిపిస్తుంది! దీనికంతటికి కారణం వేదం చదివితే దాని మహిమ పోతుందనే పిచ్చి అభిప్రాయం కాబోలు. అసలు తెలుసుకునే విద్యకే ‘వేదం’ అని పేరు కదా! అది తప్ప, ఇతరమైంది తెలిస్తే ఏమి ప్రయోజనం?
ఆదిపూడి మహాకవే కాదు, నా దృష్టిలో మహర్షి. ఆయన అల్లిన ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క వేద మంత్రానికి తూలదూగేలా ఉంది. వేదంలో స్తుతి, ప్రార్థన, ఉపాసనలని మూడు అంశాలు చోటుచే సుకున్నాయి. ఆదిపూడి వారి ‘భక్త కర్ణామృతము’ ఈ మూడు అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. పరమాత్మ స్వరూపాన్ని యథాత థంగా తెలియజేస్తే ‘భక్త కర్ణామృతము’ సత్యార్థ ప్రతిపాదితమై అలరారుతుంది.
వారి కీర్తనలలో ‘మరిరాదురా యీ మానుషజన్మము’ అనేది మనుష్య జన్మ ప్రాధాన్యతను తెలియజేస్తుంది. జీవితమంతా కష్టపడడానికో, కష్టపెట్టడానికో, సంపాదించడానికో, సుఖపడడానికో కాక, పరమ పురుషార్థమైన మోక్షాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పుడే మాన జన్మ సార్థకమవుతుందనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.
మానుషజన్మ పరమపురుషుడైన దేవదేవుని అనుగ్రహంతోనే లభిస్తుందని, అది సృష్టిలోని అందచందాలను దర్శించగలిగిన యంత్రమని, తోటి జీవులకు మేలొనరించడానికి ఉపయోగపడే సాధనరాజమని, ఎంతో పుణ్యం చేస్తే గానీ దొరికిన ధనమని చెప్తూ ఈ మహాకవి చివర్లో పలికిన పలుకులు కోట్ల రూపాయల విలువ కలిగినవి.
‘దేవుని జేర్పగ- జీవునిగొని చను
దేవదత్త మౌ దివ్యరథం బది’
ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్లడం ఉత్తమం. పక్షులు కూడా ఉదయం గూళ్లను విడిచి సాయంత్రం తిరిగి అవే గూళ్లకు చేరుకుంటాయి. ఇదొక దృష్టాంతంగా భావిస్తే మానవజన్మ పునీతమవుతుంది.
జీవికి ఎన్నో జన్మలుంటాయి. జన్మజన్మలో శరీరం. ప్రత్యేకమైన ఆకృతి. అయితే, జన్మలలో క్రిమికీటకాది జన్మలు, జంతు జన్మలున్నాయి. కానీ, అన్నింటిలో మానవ జన్మనే ఉత్తమమైంది. బుద్ధిమంతుడైన మానవుడు ఇది గుర్తెరిగి ప్రవర్తిస్తాడు. తన శరీరాన్ని తాను సంపాదించినది కాక, భగవంతుడిచ్చిన రథంగా భావిస్తాడు.
మరి ఆ రథంలో ఎక్కి భూలోకంలో సంచరిస్తూ ఉండిపోవలసిందేనా? కాదు. మానవునికి ప్రేమతో దేవుడిచ్చిన రథం అతణ్ని నిమ్మలంగా ఏ ఇబ్బంది లేకుండా దేవుని దగ్గరికే చేర్చాలి. అప్పుడే రథాన్ని అధిరోహించినందుకే కాక, రథాన్ని ఇచ్చినందుకు, అటు జీవునికి, ఇటు పరమాత్మకు ఫలం!
వ్యాసకర్త సెల్: 9885654381






