17 April, 2026 | 10:30 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఫోన్ ట్యాపింగ్ చేయమని ఎవరు చెప్పారు?

10-06-2025 01:31 AM
  1. 8 గంటల పాటు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ 
  2. ప్రభాకర్‌రావును విచారించిన సిట్
  3. ప్రణీత్‌రావు, రాధాకిషన్‌రావు, భుజంగరావు, 
  4. తిరుపతన్న వాంగ్మూలం ఆధారంగా ప్రశ్నలు
  5. రేపు మరోసారి విచారణకు రావాలని ఆదేశం

హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): ‘ఎవరు చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేశారు.. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే మీరు విదేశాలకు ఎందు కు వెళ్లిపోయారు.. కేసు నమోదు అయిందనే సమాచారంతోనే విదేశాలకు పారిపోయారా?’ అంటూ ఎస్‌ఐ బీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది.

రాష్ర్టంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి ఎస్‌ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు సోమవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో సిట్ ఎదుట విచారణ నిమిత్తం హాజరయ్యారు. సుమారు 8 గంటల పాటు ఆయన్ను అధికారులు విచారించారు. వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్, ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలోని సిట్ ప్రభాకర్‌రావును విచారించింది.

ఎవరి ప్రోద్బలంతో ఇదంతా చేశారని ప్రశ్నించగా..తాను ఎస్‌ఐబీలో పనిచేస్తున్నప్పటికీ తనపైనా అధికారులు ఉన్నా రని, తన పైఅధికారులకు తాను చేసిన ప్రతీ పని తెలుసునని ప్రభాకర్‌రావు పేర్కొన్నట్లు సమాచారం. దర్యాప్తు బృందం విచారణ చేసి ప్రభాకర్‌రావు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. విచారణ ప్రక్రియ మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డింగ్ పెట్టారు. సాయం త్రం 7 గంటల వరకు విచారణ కొనసాగింది.

గతంలో అరెస్ట్ అయిన తిరు పతన్న, రాధాకిషన్‌రావు, ప్రణీత్‌రావు, భుజంగరావు స్టేట్‌మెంట్ ఆధారంగా విచారణలో కీలకమైన అనేక ప్రశ్నలను సంధించారు. ప్రణీత్‌రావుతో పాటు ఎస్‌ఐబీ చీఫ్‌గా చేసిన కీలకమైన కార్యకలాపాలపై విచారణ చేశారు. ఎస్‌ఐ బీలోని హార్డ్‌డిస్క్‌లను ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చిందని ఆరా తీశారు. కొన్ని దశాబ్దాలుగా స్టోర్ చేసి న ఉగ్రవాద, తీవ్రవాద సమాచారం ఎందుకు మాయం చేశారంటూ ప్రశ్నించారు. 

ప్రణీత్‌రావుకి హార్డ్ డిస్కులను ధ్వంసం చేయమని చెప్పిన వారెవరంటూ సిట్ ఆరా తీసింది. పాత హార్డ్‌డిస్కులను తీసేసి వాటి స్థానంలో కొత్త వాటిని పెట్టమని చెప్పిందేవరని ప్రశ్నించారు. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేసే క్రమంలో ప్రముఖుల జాబితాను ప్రొఫైల్స్‌గా క్రియేట్ చేసి అక్రమ ట్యాపింగ్‌కి పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణ సందర్భంగా పలు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది.

గతంలో నాంపల్లి కోర్టులో సమర్పించిన అఫిడవిట్‌లోని అంశాలు మాత్రమే చెప్తుండగా.. ఇప్పటివరకూ సేకరించిన ఆధారాలు ముందుంచి ప్రభాకర్‌రావును ప్రశ్నించినట్లు సమాచారం. 2023 ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్షనేతల ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రభాకర్‌రావుపై ఆరోపణలున్న నేపథ్యంలో ఈ అంశంపై సిట్ ఆయనను ప్రత్యేకంగా ప్రశ్నించిందని తెలుస్తోంది.

ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ట్యాపింగ్ చేసి టాస్క్‌ఫోర్స్ పోలీసులతో రైడ్ చేయించినట్లు వచ్చిన ఆరోపణలపైనా సిట్ ఆరా తీసింది. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ఉన్న సమయంలో ఆయనతో పాటు కీలక నేతల కదలికలపై నిఘా పెట్టినట్లు విచారణలో నలుగురు నిందితులు ఒప్పకున్న విషయంపైనా ప్రభాకర్‌రావును విచారించారు.

రాజకీయ, సినీ ప్రముఖులు, జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రశ్నల వర్షం కురిపించారు. బేగంపేటలోని ఎస్‌ఐబీ కార్యాలయంలో ప్రైవేటు ఇంటర్నెట్ కనెక్షన్ సాయంతో ప్రణీత్‌రావు తన టీమ్ పనిచేసినట్లు గుర్తించిన పోలీసులు.. ఈ అంశంపై ఆరా తీశారు. 

11న మళ్లీ రావాలి..

ఈ నెల 11న మరొకసారి విచారణకు రావాలని ప్రభాకర్‌రావుకు నోటీసులు ఇచ్చి పంపించేశారు. వచ్చేటప్పుడు ఆయన గత సాధారణ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల సమయంలో వాడిన రెండు సెల్‌ఫోన్లు తీసుకొని రావాలని ఆదేశించినట్లు సమాచారం. ఫోన్లతో పాటు ప్రభాకర్‌రావు వాడిన లాప్‌టాప్, మ్యాక్ బుక్ తీసుకురావాలని కూడా ఆదేశించినట్లు తెలుస్తోంది. 

కేసు నమోదు.. అమెరికాకు పరారీ

గతేడాది పంజాగుట్ట ఠాణాలో అక్రమ ఫోన్ ట్యాపింగ్‌పై కేసు నమోదవ్వగా.. దర్యాప్తు నిమిత్తం సిట్‌ను ఏర్పాటు చేసిన మరుసటి రోజే ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అమెరికాకు పలాయనం చిత్తగించారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు పోలీస్ అధికారులు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావులను అరెస్ట్ చేశారు.

ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేశామని ఆ నలుగురు తమ వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావును భారత్‌కు రప్పించేందుకు పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు. చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్‌తో ఆదివారం రాత్రి ప్రభాకర్‌రావు హైదరాబాద్ వచ్చారు.