15-10-2025 10:31:34 PM
- హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్లాన్
- కోడలిపై అనుమానంతో మృతుడి తండ్రి ఫిర్యాదు
- వెలుగులోకి ఉద్దంతం.
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): శారీరక సుఖం కోసం ప్రియుడి మోజులో పడి నూరేళ్లు తోడుంటానని పెళ్లాడిన భార్య కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి అతికిరాతకంగా హతమార్చింది. చివరికి నేరం తన మీదికి రాకుండా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు శతవిధాలా ప్రయత్నించింది. చివరికి కోడలిపైన అనుమానంతో మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును సేదించారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ మండలం గుడిపల్లి గ్రామంలో ఈనెల 12న చోటు చేసుకోగా బుధవారం ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను డిఎస్పి బుర్రి శ్రీనివాసులు మీడియాకు వివరించారు. నాగర్ కర్నూల్ మండలం శ్రీపురం గ్రామానికి చెందిన మైన గాని రాములు(30)కి పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్లకు చెందిన మానసతో 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.
వీరికి ముగ్గురు పిల్లలున్నారు. గత ఐదు నెలల క్రితం ఇంట్లో బంగారం పోయిందని నాగర్ కర్నూల్ మండలం పెద్ద ముద్దునూరు గ్రామానికి చెందిన సురేష్ గౌడ్ మాయలు మంత్రాలతో అంజనం వేసి వాటి వివరాలు చెప్తాడని మానస తన భర్తను రాములును తీసుకెళ్లింది. అనంతరం మానస సురేష్ గౌడ్ మధ్య ఏర్పడ్డ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో భార్యను మందలించాడు. ప్రియుడిపై మోజు పెంచుకున్న భార్య మానస రాములును హతమార్చేందుకు పథకం రచించింది. ఈ నెల 8న నాగర్ కర్నూల్ మండలం గుడిపల్లిలో జరిగే పెళ్లికి కుటుంబంతో సహా వెళ్లారు.
ఈ విషయాన్ని ప్రియుడు సురేష్ గౌడ్ కు తెలిపింది. రాములను హత్య చేసేందుకు తన దగ్గర పనిచేసే పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్లకు చెందిన బాలాపీరును, అతని బామ్మర్ది హనుమంతును హత్యకు సహకరిస్తే ఒక్కొక్కరికి రెండు లక్షల 80 వేల రూపాయలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఈనెల 12న పెద్ద ముద్దనూరులో ప్రియుడు సురేష్ గౌడ్ వ్యవసాయ పొలంలో ధావత్ తీస్తానని రాములను అక్కడికి తీసుకెళ్లాడు. మద్యం సేవించిన అనంతరం టిజి 06టిఆర్ 8021 కారులో ఎక్కించుకొని గుడిపల్లి దగ్గరికి తీసుకొచ్చి అక్కడ మరోసారి మద్యం సేవించి ముఖానికి వెంట తెచ్చుకున్న ప్లాస్టర్ని చుట్టి ఊపిరాడకుండా చంపేశారు. అనంతరం బైక్ పై యాక్సిడెంట్ కారణంగా మృతి చెందినట్లు చిత్రీకరించేందుకు పక్కనే బైకును కింద వేసి రాములు ముఖానికి గాయాలు చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసును చేదించారు.