calender_icon.png 10 August, 2025 | 11:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాళ్లరాంపూర్ గ్రామాభివృద్ధి కమిటీ తీరు మారేనా..?

07-08-2025 12:00:00 AM

 ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు 

నిజామాబాద్ లీగల్ కరెస్పాండెంట్ ఆగస్టు 6: (విజయ క్రాంతి) :  నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని గ్రామాలలో గ్రామ అభివృద్ధి కమిటీలు సమాంతర గ్రామ ప్రభుత్వాలను నడుపుతున్న తీరు వార్తా సాధనాల ద్వారా అందరికీ తెలిసిన విషయమే. ఎర్గట్ల మండలం తాళ్ళ రాంపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ మిగతా విడిసిలకు భిన్నంగా మరోమెట్టు ఎక్కింది.రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం దృష్టిలో పడింది. విడిసి వెలివేతలకు గురైన బాధితులు ఒక రిట్ పిటిషన్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేయడంతో మరో వివాదానికి కేంద్రబిందువుగా మారింది.

విలేజ్ డెవలప్మెంట్ కమిటీ షార్ట్ కట్ లో విడిసి ల ఆధిపత్యం ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ లో రాజ్యంఏలుతున్న ఎలుబడిని జిల్లా న్యాయవ్యవస్థ పసిగట్టి విడిసిల చట్ట వ్యతిరేక పోకడలను ఒక రాజీ పరిష్కారం దిశగా తీసుకువెళ్లి పరిష్కరించాలనే ఆలోచనతో ఉన్నది. విడిసిలో అన్ని కులాల ప్రాతినిద్యం ఉన్నందున తాళ్ళ రాంపూర్ విడిసి కమిటీ సభ్యులు, గ్రామంలో సామాజిక బహిష్కరణకు, జరిమానాలకు గురైన బాధితులతో,గుడిలోకి అనుమతించని ఆడపడుచులతో నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు జిల్లాకోర్టు ప్రాంగణంలోని సంస్థ కార్యాలయం న్యాయసేవ సదన్ లో సమావేశం నిర్వహించారు.

అందరితో ఆయన విడివిడిగా మాట్లాడారు. తాళ్ళ రాంపూర్ విడిసి గీత కార్మికులను ఎందుకు సామాజిక వెలివేతకు గురి చేసింది.గుడి నుండి మహిళలను ఎందుకు వెళ్లిపొమ్మన్నారు. జరిమానాలు విధించడమేమిటి, ఈత చెట్ల కాల్చివేతలేమిటి. చట్టాన్ని అతిక్రమించడ మేమిటి..?, చట్టవిరుద్ధ చర్యలు ఎందుకు అంటూ జడ్జి ప్రశ్నల వర్షం కురిపించారు. విడిసి లో అన్ని కులాలకు సమబాగం ఉన్నప్పుడు అన్ని కులాల శ్రేయస్సే పరమావదిగా ఉండాలి కదా అంటు హితబోధ చేశారు.ఊరుమ్మడి బతుకులు బాగుండాలంటే అసమానతల అడ్డుగోడలు నిర్మించవద్దునంటు నిర్మాణాత్మకమైన ప్రతిపాదనను ముందుపెట్టి నూతన ఒరవడులు దిద్దుకుని గ్రామ అభివృద్ధికి బాటలు వేసుకోవచ్చని అన్నారు.

గ్రామ అభివృద్ధి కమిటీ లక్ష్యం గ్రామ ప్రజల సమిష్టి అభివృద్దే ఆలంబనగ వెళ్లాసిన వారు కొన్ని ప్రజా సమూహలను, గ్రామ ప్రజలతో కలవకుండా చేయడం ఏరకంగాను సమర్ధనీయం కాదని తెలిపారు.చట్టాలతో పెట్టుకోవద్దని, చట్టాలు చాలా బలమైనవని చట్టాలకు అనుగుణంగా నడుచుకోవడమే శ్రేయస్కారమని, చట్టాలను అతిక్రమిస్తే అందపాతలమేనని సుత్తిమెత్తగా వివరించారు. గ్రామాల అభివృద్ధికి కలసికట్టుగా వెళుతు, ప్రగతిపథంలో పయనించాల్సిన కొంతమంది వ్యక్తుల సమూహలైన విడిసిలు, రాజ్యాంగ వ్యవస్థలకు సవాలు కారాదని అన్నారు.

తప్పుదోవలో పోతున్న వారిని సరైన తోవలో తీసుకురావడమే జాతీయ న్యాయసేవ ప్రాధికార సంస్థ నాల్సా లక్ష్యమని, లక్ష్యసిద్ధికి కలసి రావాలని కోరారు. సమస్యలు ఉన్నదగ్గర పరిష్కారం ఉంటుందని తాళ్ళ రాంపూర్ విడిసి, గీత కార్మికులు, బాధిత మహిళలు ఒక ఉమ్మడి పరిష్కారం దిశగా అడుగులు వేసి, వివాదాలకు అంతం పలికి అంతిమ పరిష్కారంతో రావాలని జడ్జి ఉదయ్ భాస్కర్ రావు ఆశించారు.