calender_icon.png 9 February, 2026 | 4:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌కు మున్సిపల్ పీఠం దక్కుతుందా?

09-02-2026 12:17:58 AM

బీఆర్‌ఎస్ కంచుకోటలకు బీటలు వారుతున్నాయా?

సిద్దిపేట, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమానికి కంచుకోటగా పేరొందిన సిద్దిపేట జిల్లా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇ ప్పటివరకు బీఆర్‌ఎస్ అజేయ గడ్డలుగా నిలిచిన హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీల్లో ఈసారి పోరు అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. రాష్ట్రంలో కాం గ్రెస్ అధికారంలోకి రావడంతో గ్రామస్థాయి నుంచి ఆ పార్టీకి ఊపు వచ్చింది.

పలు గ్రా మాల్లో కాంగ్రెస్ సర్పంచులు, వార్డు సభ్యు లు గెలుపొందడం మున్సిపల్ ఎన్నికల్లో కొత్త సమీకరణాలకు దారితీసింది.ఈసారి బీజేపీ కూడా అన్ని వార్డుల్లో అభ్యర్థులను బరిలో దింపడంతో త్రిముఖ పోటీ తప్పనిసరిగా మారింది. దీంతో బీఆర్‌ఎస్ ఆధిప త్యానికి బీటలు వారుతున్నాయా? కాంగ్రెస్ మున్సిపల్ పీఠంపై బోణీ కొడుతుందా? బీజేపీ ఊహించని బలాన్ని ప్రదర్శిస్తుందా? అనే ప్రశ్నలు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

4 మున్సిపాలిటీల్లో 2 ఎ స్సీ, 2 బీసీలకు రిజర్వుడ్ కావడంతో అభ్యర్థుల ఎంపికలో పార్టీల్లో తీవ్ర పోటీ నెల కొంది. ప్రచారాల్లో మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా దూసుకుపోతూ హామీల వర్షం కురిపిస్తున్నాయి. అయితే ఏ పార్టీ పీఠం దక్కించుకుంటుందో అంచనా వేయ డం కష్టసాధ్యంగా మారింది.హుస్నాబాద్ ఎమ్మెల్యేగా, కీలక మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ తన నియోజకవర్గంపైనే ఎక్కువ దృష్టి పెట్టారని, జిల్లా కాంగ్రెస్ అభ్యర్థులకు తగిన మద్దతు లభించడం లేదన్న అసంతృ ప్తి పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది.

మరోవైపు బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు దుబ్బాకతో పాటు గజ్వేల్లో ప్రచారాన్ని ము మ్మరం చేసి, దుబ్బాక మున్సిపాలిటీ కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.బీఆర్‌ఎస్ నుంచి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గజ్వేల్, దుబ్బాక, చేర్యాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి పార్టీ స్థానాన్ని కాపాడుకునేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు.

గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ సీఎం కేసీఆర్ ప్రచారంపై ప్రత్యక్ష ఆసక్తి చూపకపోవడం బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆయన కేవలం దిశానిర్దేశం చేస్తుండటంతో గెలవాల్సిన చోట కౌన్సిలర్లు ఓడిపోతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.మొత్తానికి నాలు గు మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ తిరిగి పట్టు నిలబెట్టుకుంటుందా? కాంగ్రెస్ రాజకీయంగా కొత్త పేజీ తెరుస్తుందా? బీజేపీ ఊహించని బ్రేక్ ఇస్తుందా? అన్న ఉత్కంఠభరిత ప్రశ్నల నడుమ సిద్దిపేట జిల్లా రాజకీయాలు మరిగిపోతున్నాయి. ఎన్నికల ఫలితాలే ఈ సమరానికి తుది తీర్పు చెప్పనున్నాయి.