calender_icon.png 6 December, 2024 | 4:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐటీ పార్క్ నిర్మాణం జరిగేనా?

15-10-2024 02:35:27 AM

  1. మేడ్చల్‌లో 100 కోట్లతో టవర్ల నిర్మాణానికి ప్రతిపాదన
  2. 2022 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసిన అప్పటి మంత్రి కేటీఆర్
  3. ఇప్పటికీ మొదలుకాని పనులు

మేడ్చల్, అక్టోబర్ 1౪: మేడ్చల్‌లో ఐటీ పార్క్ నిర్మాణంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శంకుస్థాపన చేసి రెండున్నరేళ్లు దాటినా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది పరిస్థితి. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హ యాంలో ఐటీని నగరంలో నలువైపులా విస్తరించాలనే ఉద్దేశంతో అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ మేడ్చల్‌లో ఐటీ పార్క్ నిర్మాణానికి  శంకుస్థాపన చేశారు.

మేడ్చల్ మం డలం కండ్లకోయ శివారులో ఔటర్ రింగ్ రోడ్డు, 44వ నంబర్ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న మార్కెట్ కమిటీ స్థలాన్ని ఎంపిక చేశారు. తొమ్మిది ఎకరాలు ఒకచోట, ఎకరం పైచిలుకు సమీపంలో ఐటీ పార్క్‌కు కేటాయించారు.

ఇందులో రెసిడెన్సియల్ టవర్ జీ ప్లస్ 20, ఐటీ టవర్ జీ ప్లస్ 14, కమర్షియల్ టవర్ జీ ప్లస్ 10 నిర్మించాలని నిర్ణయించారు. ఎస్‌ఎంఎస్ గేట్ వే టెక్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి టీఎస్‌ఐఐసీ నిర్మాణ బాధ్యతలు ఇచ్చింది. ఈ కంపెనీ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది.

హెచ్‌ఎండీఏలో ఫైల్ పెండింగ్

ఐటీ భవనాల నిర్మాణానికి సంబంధించి ఫైల్ హెచ్‌ఎండీఏలో పెండింగ్‌లో ఉంది. శంకుస్థాపన చేసిన తర్వాత 20 నెలల వరకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ సమయంలో దీనికి కావాల్సిన అనుమతులు ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్న ఉత్పన్న మవుతోంది. పైగా కేసీఆర్ పుట్టినరోజు సం దర్భంగా దీనికి శ్రీకారం చుట్టారు.

ప్రస్తుతం ప్రభుత్వం మారింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీశైలం మార్గంలో ఫోర్త్ సిటీ నిర్మించాలని నిర్ణయించింది. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులన్నీ అక్కడే ఏర్పాటు చేయనుంది. ఈ పరిస్థితుల్లో మేడ్చల్ ఐటీ హబ్‌కు అనుమ తులిస్తుందా అనేది సందేహంగా మారింది.

ఐటీ పార్క్ పేరు చెప్పి..

ఐటీ భవనాల నిర్మాణానికి రెండున్నరేళ్లుగా ఒక్క ఇటుక పేర్చనప్పటికీ స్థానిక రియల్టర్లు, బిల్డర్లు ఐటీ పార్క్‌ను చక్కగా ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు.ఇక్కడే ఐటీ పార్క్ ఏర్పాటవుతుందని స్థలాల కొనుగోలుదారులకు చెబుతున్నారు. వాస్తవానికి ఐటీ పార్క్ కు శంకుస్థాపన చేయగానే సమీపంలోని భూముల ధరలు విప రీతంగా పెరిగిపోయాయి.

నిర్మాణ కంపెనీలు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించాయి. అప్పట్లో బుకింగ్‌లు కూడా జరిగాయి. ఐటీ పార్క్ స్థలాన్ని చూపిస్తూ తమ వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తే అభివృద్ధి చెందే అవకాశముంది. ఏడు జిల్లాలవారికి సౌకర్యంగా ఉంటుంది. కాంగ్రెస్ నాయకులు అనుమతికి కృషి చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.