24-01-2026 01:08:28 AM
ప్రభాస్, సందీప్‌రెడ్డి వంగా కాంబో చిత్రం ‘స్పిరిట్’. భద్రకాళి పిక్చర్స్, టీ -సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా గురించి ఎలాంటి చిన్న వార్త వినిపించినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో భాగమవుతున్న ముఖ్యతారాగణంపై ఆసక్తికర వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వినవస్తున్నాయి. ప్రభాస్ ఇందులో శక్తిమంతమైన పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండటంతో ఆయనను ఢీకొట్టే ప్రతినాయకుడు ఎవరనే విషయమై ఊహాగానాలు రెట్టింపయ్యాయి.
ప్రభాస్ ప్రాణ స్నేహితుడు, స్టార్ హీరో గోపీచంద్ ఈ చిత్రంలో మెయిన్ విలన్‌గా నటించబోతున్నారని చర్చించుకుంటున్నారు. దాదాపు 22 ఏళ్ల క్రితం ’వర్షం’ సినిమాలో వీరిద్దరూ కథానాయకుడు, ప్రతినాయకుడిగా తెరపై తలబడ్డ రోమాంచితమైన సన్నివేశాలు ఎవర్ గ్రీన్‌గా నిలిచాయి. ఇప్పుడు మళ్లీ అదే క్రేజీ కాంబోను రిపీట్ చేస్తూ సందీప్‌రెడ్డి శక్తిమంతమైన విలనిజాన్ని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఇటీవల గోపీచంద్‌తో సందీప్‌రెడ్డి ఫోటోలు దిగడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇదే నిజమై, టీమ్ అధికారికంగా ప్రకటిస్తే గనుక థియేటర్లు తగలబడిపోవటం ఖాయం అంటూ కామెంట్లు చేస్తున్నారు రెబల్ ఫ్యాన్స్! త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2027, మార్చి 5న విడుదల కానుంది.