3 May, 2026 | 12:48 PM

‘హైనా’ బాధితులకు పరిహారం అందేనా?

26-06-2024 12:01 AM
  1. మూగజీవాల మృతితో నష్టపోయిన రైతులు
  2. రెండేళ్లుగా అందని పరిహారం  

సిద్దిపేట రూరల్, జూన్ 2౫: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల జరిగిన హైనా దాడిలో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. దీంతో బాధితులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు నెల రోజులుగా మండలంలోని మెట్‌పల్లి, మాచాపూర్, సలెంద్రి, చంద్లాపూర్ గ్రామాల్లో హైనా సంచరిస్తూ హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. మెట్‌పల్లిలో రెండు లేగదూడలు హైనా దాడిలో మృతిచెందాయి.

మాచాపూర్‌లో మే 22న 80 గొర్రెలపై దాడిచేయడంతో 65 మృతిచెందగా, 15 గాయపడ్డాయి. అదే విధంగా వేర్వేరు దొడ్ల దగ్గర మూడు లేగ దూడలపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. చంద్లాపూర్‌లో రెండు మేకలు, ఒక లేగదూడ మృతిచెందాయి. మాచాపూర్‌లో గత రెండేళ్ల కాలంలో ఒకే రైతుకు చెందిన నాలుగు లేగదూడలు హైనా దాడిలో మృత్యువాత పడ్డాయి. అయితే సదరు రైతు పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇంతవరకు అందలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవల హైనా దాడుల్లో మూగజీవాలు మృత్యువాత పడడంతో తమకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం నుంచి పరిహారం ఎప్పుడు అందుతుందో అని బాధితులు వాపోతున్నారు. 

బాధితులకు నష్టపరిహారం అందిస్తాం..  

హైనా దాడిలో మృత్యువాత పడిన మూగజీవాలకు సంబంధించి నష్ట పరిహారం అందిస్తాం. ఇప్పటికే కొన్ని డాక్యుమెంట్లు ప్రభుత్వానికి పంపించాం. బాధితులు హైనా దాడిలో మూగజీవా లు మరణించినట్టు పశువైద్యాధికారులతో ధ్రువీకరించి డెత్ సర్టిఫికెట్లు తీసుకొచ్చి అటవీ శాఖ కార్యాలయంలో అందజేయాలి. ప్రభుత్వానికి పంపించి పరిహారం అందేలా చర్యలు చేపడతాం. 

 బుచ్చయ్య, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్