8 April, 2026 | 6:15 PM

వరంగల్ అభివృద్ధికి కృషి చేస్తా..

07-05-2024 01:35 AM

కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ ఖాయం

రేపటి మోదీ సభను విజయవంతం చేయాలి

కడియం మాటలు హాస్యాస్పదం

బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్

వరంగల్, మే 6 (విజయక్రాంతి): వరంగల్ సమగ్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హనుమకొండ హంటర్‌రోడ్‌లోని బీజేపీ కార్యాలయంలో సోమవా రం ఆయన నియోజకవర్గ సంకల్ప పత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయంగా ఉన్నత పదవులు అనుభవించిన కడియం శ్రీహరి తాను చేయని అభివృద్ధిని ఇప్పుడు తన కూతురు ద్వారా చేయిస్తానని చెప్తుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎంపీగా పదేళ్లు పనిచేసినా నియోజకవర్గ అభివృద్ధి మాటేమో గానీ కనీసం ప్రజలకు అందుబాటులో లేని విషయం తెలిసిందేనని చెప్పారు.

తనను గెలిపిస్తే వరంగల్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు, మామునూర్‌లో ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ అనుమతులు తీసుకువస్తానని తెలిపారు. కాజీపేట రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తానన్నారు. పత్తి, మిరప, పసుపు, ఉద్యానాల అభివృద్దికి పాటుపడుతానని చెప్పారు. భూపాలపల్లి రైల్వేలైన్ అనుసంధానం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. నూతన జిల్లాలలో నవోదయ గురుకులాల ఏర్పాటు చేయిస్తానన్నారు. సమ్మక్క జాతరకు జాతీయ హోదా కల్పిస్తామని, కాకతీయ కళా సంపదకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తాని చెప్పారు బుధవారం వరంగల్‌లో జరుగనున్న ప్రధాని నరేంద్రమోదీ జన సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రాజేశ్వర్‌రావు, వన్నాల శ్రీ రాములు, పార్లమెంట్ ప్రభారీ మురళీధర్‌గౌడ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, జిల్లా పార్టీ అధ్యక్షులు రావు పద్మ తదితరులు పాల్గొన్నారు.