కరీంనగర్‌పై కాంగ్రెస్ ఫోకస్

07-05-2024 01:31:47 AM

నేడు రాహుల్‌గాంధీ రాక 

ఖాళీ అవుతున్న బీఆర్‌ఎస్ 

క్యూ కడుతున్న నేతలు

కరీంనగర్, మే౬ (విజయక్రాంతి): కరీంనగర్ పార్లమెంటు స్థానంపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సీఎం, పీసీసీ ప్రెసిడెంట్  రేవంత్‌రెడ్డి జమ్మికుంట, సిరిసిల్ల జనజాతర సభల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం కరీంనగర్‌కు రానున్నారు. ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల మైదానంలో సాయంత్రం ౪ గంటలకు -జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుతో కలసి పాల్గొననున్నారు. రాహుల్ సభ విజయవంతం కోసం -మంత్రి, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు జనసమీకరణలో నిమగ్నమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజీవ్ చౌక్‌లో రాహుల్‌గాంధీ నిర్వహించిన రోడ్ షోకు మంచి స్పందన వచ్చింది.

తాజాగా పార్లమెంటు ఎన్నికల సభలో పాల్గొనేందుకు రాహుల్ కరీంనగర్‌కు వస్తుండటంతో పార్టీకి మరింత బలం చేకూరుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కరీంనగర్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన ఆలస్యం కావడంతో మొదట ప్రచారంలో వెనుకబడినట్టు కనిపించినా తరు వాత పుంజుకున్నది. అటు కాంగ్రెస్‌లో చేరేందుకు బీఆర్‌ఎస్ నేతలు క్యూ కట్టారు. ఇప్పటికే 11 మంది కార్పొరేటర్లు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు. మాజీ సర్పంచులు, ఇతర పార్టీలో ఉన్న నేతలు పార్టీలో చేరడం, పార్టీ కోసం పని చేస్తుండటంతో అభ్యర్థిలో గెలుస్తానన్న నమ్మకం వచ్చింది.రాహుల్ పర్యటన ద్వారా కాంగ్రెస్‌లో మరింత జోష్ పెరగనుంది. 

రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లోకి బొమ్మ

-రాహుల్ గాంధీ మంగళవారం కరీంనగర్ వస్తున్న సందర్భంగా మరికొందరు బీఆర్‌ఎస్‌కు చెందిన ముఖ్యనేతలు, కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే చాలామంది బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరగా, ఒకరిద్దరు మాత్రమే బీజేపీ నుంచి చేరారు. చేరికల ద్వారా ఎక్కువ నష్టపోయింది బీఆర్‌ఎస్ అని చెప్పవచ్చు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ బీజేపీ ఇన్‌చార్జ్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనతోపాటు ఆయన అచనురులు హస్తం గూటికి వచ్చారు. రాహుల్ రాక సందర్భంగా చేరికల జోరు కొనసాగే అవకాశం ఉంది. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా చేరికలను ప్రోత్సహిస్తుండటంతో ఎవరు ఎప్పుడు పార్టీ మారుతారో నన్న టెన్షన్ బీఆర్‌ఎస్ పార్టీలో నెలకొంది.