6 May, 2026 | 5:37 AM

తల్లినే మారుస్తారా?

10-12-2024 02:18 AM
  1. ప్రభుత్వం మారినపుడు తలరాతలు మారాలె గానీ.. తల్లులను మారుస్తారా?
  2. మేము ఆకట్టుకునేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపుదిద్దాం.. ఈ తల్లి బీదరాలిగా ఉంది
  3. కాంగ్రెస్ మూర్ఖులకు  చరిత్ర తెలియదు 
  4. నేడు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం
  5. మేడ్చల్‌లో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

మేడ్చల్, డిసెంబర్ 9: వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాహుల్‌గాంధీ తండ్రి విగ్రహాన్ని, కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని గాంధీభవన్‌కు తరలిస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు.

సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గండిమైసమ్మ సమీపంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు మూర్ఖులని, వారికి తెలంగాణ చరిత్ర తెలియదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తెలంగాణ తల్లి ఆకృతిని మార్చాల్సిన అవసరమేమి వచ్చిందని, ఎవరు అభ్యంతరం చెప్పారని ప్రశ్నించారు. ఆలిని మార్చిన దుర్మార్గులను చూశాం కానీ, తల్లిని మార్చిన వారిని ప్రపంచంలో ఎక్కడా చూడలేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలం గాణ అస్తిత్వానికి ప్రతీకగా 2007లో కవులు, కళాకారులు, శిల్పులు, మేధావులు తెలంగాణ తల్లికి ఆకృతినిచ్చారని గుర్తుచేశారు.

తెలంగాణ పండుగ ఉట్టిపడేలా బతుకమ్మ, చేనేత కళాకారుల నైపుణ్యానికి చిహ్నంగా పోచంపల్లి, గద్వాల చీరలు, కరీంనగర్ మెట్టెలు, అందమైన కోహినూర్ వజ్రం, బంగారు కిరీటంతో చూడగానే ఆకట్టుకునేలా తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేశా రని స్పష్టంచేశారు. ప్రస్తుతం తెలంగాణ తల్లి బీదరాలిగా, తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని నిరూపించేలా తయారుచేశారని మండిపడ్డారు.

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ, బంగారు కిరీటం, కోహినూర్ వజ్రం మాయం చేశారన్నారు. తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ప్రభుత్వం మారినప్పు డు తలరాతలు మారాలే గాని తల్లులను మారుస్తారా? అని ప్రశ్నించారు.  

ఏంచేశారని విజయోత్సవాలు? 

ఏడాది కాలంలో ఏంచేశారని విజయోత్సవా లు చేసుకుంటున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. విజయోత్సవాల పేరిట దుబారా ఖర్చులు చేస్తున్నారే తప్ప అభివృద్ధి మాత్రం శూన్యమని చెప్పారు. ఆరు గ్యారెంటీలను అటకెక్కించారని, రుణమాఫీ చేయలేకపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ‘కేసీఆర్ మీద తిట్లు.. దేవుళ్లమీద ఒట్లు.. హామీలకు తూట్లు’ అని ఎద్దేవాచేశారు.

అదానీ కోసం, అల్లుడి కోసం, బావమరిది కోసం, అన్నదమ్ముల కోసం కొత్త విధానాలను ప్రవేశపెడుతున్నారని విమర్శించారు. అనుముల అన్నద మ్ములను అదానీల మాదిరిగా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సభలో జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ మంత్రులు మల్లారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 

నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ నిరసనలు 

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహ రాజకీయానికి నిరసనగా మంగళవారం బీఆర్‌ఎస్ శాంతియుత నిరసన కార్య క్రమాలు చేపడుతున్నట్టు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ సోమవారం ఓ ప్రకటన లో తెలిపారు. తెలంగాణ తల్లి పేరు చెప్పి కాం గ్రెస్ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా తెలంగాణలో ఉన్న ప్రతి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకాలతోపాటు పంచామృత అభిషేకాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కాం గ్రెస్ మూర్ఖులకు తెలంగాణ చరిత్ర తెలియదని.. వారిని క్షమించమని తెలంగాణ తల్లిని వేడుకుందామని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారుడు, ప్రతి బీఆర్‌ఎస్ కార్యకర్త తమ వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ తల్లి ఫొటోను ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకోవాలని కోరారు.