19-12-2025 12:50:50 AM
హైదరాబాద్, డిసెంబర్ 18(విజయక్రాంతి): నౌహీరా షేక్‌కు చెందిన హీరా గ్రూప్‌పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు సమయం వృథా చేస్తున్నారంటూ గురువారం మండిపడింది. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ తప్పుదోవ పట్టించేలా ఉందంటూ హీరా గ్రూప్‌నకు రూ.5 కోట్ల జరిమానాను న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక విధించారు. ఆ మొత్తాన్ని 8 వారాల్లో పీఎం సహాయ నిధికి జమ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈడీ అధికారులు తమ ఆస్తుల విలువను తక్కువుగా చూపారని, ఈ నెల 26న వేసే వేలాన్ని రద్దు చేయాలని, అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని నౌహీరా షేక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వేలం వేస్తున్నట్లు ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తప్పుడు పిటిషన్లు వేసి కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు హీరా గ్రూప్‌నకు రూ.5కోట్ల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా పేదల నుంచి పెట్టుబడి పేరుతో డబ్బులు వసూలు చేసి తిరిగి చెల్లించలేదని హీరా గ్రూప్‌తో పాటు.. నౌహీరా షేక్ పైనా ఈడీ అధికారులు కేసు నమోదు చేసి 59 ఆస్తులను అటాచ్ చేశారు.