ముచ్చటగా మూడు సినిమాలతో..
టాలీవుడ్ హీరో నితిన్ ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయారు. కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకునే క్రమంలో తడబడుతున్నారు. ‘చెక్’, ‘రంగ్‌దే’, ‘మ్యాస్ట్రో’, ‘మాచర్ల నియోజకవర్గం’, ’ఎక్స్‌ట్రా ఆర్టినరీ మ్యాన్’, ‘రాబిన్ హుడ్’, ‘తమ్ముడు’ వంటి చిత్రాలతో నితిన్ వరుసగా పరాజయాలను చవిచూశారు నితిన్. ఈ నేపథ్యంలోనే పక్కా వ్యూహంతో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఇలా రూటు మార్చడం ద్వారా మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కే దిశగా వేగం పెంచాడా..? అంటే ఔననే సమాధానమే వస్తోంది టాలీవుడ్ వర్గాల నుంచి! ఎందుకంటే ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమా పట్టాలపై ఉండగానే మరో రెండు కథలను ఓకే చేయడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నితిన్ ప్రస్తుతం డైరెక్టర్ వీఐ ఆనంద్ తెరకెక్కిస్తున్న భారీ సైన్స్‌ఫిక్షన్ సినిమాలో నటిస్తున్నారు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో సినిమాలు తీసే ఆనంద్.. నితిన్ కోసం ఈ సరికొత్త కథను సిద్ధం చేశారు. అయితే, ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే నితిన్ మరో రెండు క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఇందులో ఒకటి ‘ఆయ్’ సినిమాతో బ్లాక్‌బస్టర్‌హిట్ అందుకున్న దర్శకుడు అంజి సిద్ధం చేసిన కథ. తన సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌లోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. జూలై నుంచి చిత్రీకరణ ప్రారంభించి, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే లక్ష్యంతో నితిన్ ఉన్నారు. ఇదేకాకుండా ఒక ప్రముఖ నిర్మాణ సంస్థలో మరో కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి నితిన్ సిద్ధమయ్యారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. మొత్తానికి రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా, కొత్త తరహా కథాంశాలను ఎంచుకుంటూ మళ్లీ విజయాల బాట పడుతున్నారన్నమాట నితిన్.




