20-12-2025 12:50:13 AM
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
వనపర్తి, డిసెంబర్ 19 ( విజయక్రాంతి ) : ముందస్తు అప్రమత్తత, సంసిద్దత ద్వారానే విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శుక్రవారం, ప్రకృతి విపత్తులు (వరదలు, పారిశ్రమిక ప్రమాదాల) నుంచి చేపట్టే రక్షణ చర్యలు, మాక్ ఎక్స్సజ్ కార్యక్రమ నిర్వహణపై సిఎస్ రామకృష్ణ రావు, జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ (నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటి)అధికారులు మేజర్ జనరల్ సుధీర్ బల్, సయ్యద్ అదా హుస్సేన్ తో కలిసి, రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ముందస్తు అప్రమత్తత ద్వారా విపత్కర సమయాల్లో ప్రాణ, ఆస్తి నష్టాలు నివారించగలుగుతామని చెప్పారు.పరిస్థితులను అంచనా వేయగలిగితే నష్టాలను తగ్గించగలుగుతామని వివరించారు. రాష్ట్రంలో ఈ నెల 22 న విపత్తుల నిర్వహణ, సంసిద్దతపై మాక్ ఎక్స్సజ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి వనపర్తి జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ రెవిన్యూ ఖీమ్య నాయక్ తో కలిసి హాజరయ్యారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ, జిల్లాల్లో విపత్తుల నిర్వహణకు అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని అన్నారు.
ప్రజలకు విపత్తుల సమయంలో రక్షణ పొందేలా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. విపత్తుల కారణంగా ఎటువంటి నష్టాలు కలుగకుండా సిద్ధంగా ఉన్నామని అన్నారు.విస్తృతంగా ప్రజలకు విపత్తుల సమయంలో రక్షణపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. సమావేశంలో అన్ని లైన్ డిపార్ట్మెంట్ ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.