19 August, 2026 | 2:00 AM

ఎండుతున్న వరి పంట!

19-08-2026 12:47 AM
  1. వానలు కురవక అన్నదాత ఆగమాగం
  2. అడుగంటుతున్న భూగర్భ జలాలు
  3. దిక్కుతోచని స్థితిలో రైతులు

జనగామ, ఆగస్టు 18 (విజయక్రాంతి): జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో ఆశించిన వర్షాలు కురవక, బావుల్లో నీరు అడుగంటి పోవడంతో సాగు చేసిన వరి పంటలు బీటలు వారుతున్నాయి. వందల ఎకరాల్లో వరి పంట సాగుచేసిన రైతులు వరుణుడి కరుణ కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. వేల రూపాయలు పంటల సాగు కోసం తెచ్చిన అప్పులు తీర్చడం ఎలా అంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

మండలంలో 4200 ఎకరాల్లో పంట..

తరిగొప్పుల మండల వ్యాప్తంగా ఈ సీజన్ లో 4200 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. నాట్లు వేసి 25-30 రోజులు అవుతోంది. ఈ సమయంలో నీరు అందకపోతే పంట చేతికి రాదు. వానలు కురవక, కాలువలకు నీళ్లు రాక మండల రైతులందరూ ఆందోళనలో ఉన్నారు. జనగామ జిల్లా వ్యాప్తంగా దాదాపు 80 శాతం రైతుల పరిస్థితి ఇదే.  ‘ప్రభుత్వం వెంటనే స్పందించాలి. లేదా ఎండిపోయిన పంటకు పరిహారం ఇవ్వాలి‘ అని గ్రామ రైతులు కోరుతున్నారు. తరిగొప్పుల వ్యవసాయ అధికారులు గ్రామాన్ని సందర్శించి, నీటిని ఆదా చేసే పద్ధతులు పాటించాలని సూచించారు. ఒక చినుకు వర్షం కోసం రైతులందరూ ఇప్పుడు దేవుడికి మొక్కుతున్నారు.

పొలంలో ఇదీ పరిస్థితి..

ఇప్పుడు పొలమంతా పగుళ్లు. నాటు వేసిన మొక్కలు పసుపు రంగులోకి మారి ఎండుతున్నాయి. బోరులో నీరు అడుగంటింది. కరెంటు 10 గంటలు ఇస్తున్నా బావిలో, బోర్లలో మోటారు వేయడానికి అవకాశం లేదు.‘రోజూ ఉదయాన్నే లేచి ఆకాశం చూస్తా. మేఘం కనిపిస్తే చాలు అనుకుంటా. కానీ ఎండ మాత్రమే మండుతోంది‘ అని కన్నీళ్లు పెట్టుకున్నారు. 

 భిక్షపతి, రైతు