19 August, 2026 | 1:24 AM

మెట్రో బోగీల పెంపు!

19-08-2026 12:26 AM
  1. 3 కోచ్‌ల రైళ్లు 4 కోచ్‌లుగా మార్పు    
  2. రూ.1,200 కోట్ల అంచనా వ్యయం
  3. 10 నెలల్లో అందుబాటులోకి  

హైదరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి) : హైదరాబాద్ మెట్రోలో ప్రయాణం మరింత సులభం కానుంది. 60 కొత్త కోచ్‌ల కోనుగోలుకు కసరత్తు చేపట్టింది. మూడు కోచ్‌లతో నడుస్తున్న మెట్రో రైళ్లు ఇక నాలుగు కోచ్‌లతో పరుగులు పెట్టనున్నాయి. ప్రస్తుతం 57 రేక్‌లకు అదనపు కోచ్‌లను జత చేసి ప్రయాణికులకు మరింత వెసులుబాటు కల్పించే దిశగా రూ.1000 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు రూపొందిస్తోంది.

ప్రస్తుతం ఎల్బీనగర్ జేబీఎస్ నాగోల్ మూడు కారిడార్లలో కలిపి 69.2 కిలో మీటర్ల మేర మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. మొత్తం 57 రైళు మూడు కోచ్‌ల చొప్పున ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. రోజుకు సుమారు 1,200 ట్రిప్పుల్లో 4.6 లక్షల మంది మెట్రోలో రాకపోకలు సాగిస్తున్నట్లు తాజా వివరాలు వెల్లడిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది.

ఒక్కో కోచ్‌కు రూ.20 కోట్లు..

60 కొత్త కోచ్‌లు కొనుగోలుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం మూడు కోచ్‌లతో నడుస్తున్న రైళ్లకు అదనంగా ఒక్కో కోచ్ జత చేయడం వల్ల వాటి సామర్థ్యాన్ని నాలుగకు పెంచనున్నారు. ఒక్కో కోచ్‌కు సుమారు రూ.20 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ లెక్కన 60 కోచ్‌లకు సుమారు రూ.1,200 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం నిధులు సమీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది.

అయితే గతంలో 60 కొత్త కోచ్‌లను 10 కొత్త ఆరు కోచ్‌ల రైలు సెట్లుగా తీసుకురావాలనే ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. ఆ ప్రతిపాదన ప్రకారం ఒక్కో ఆరు కోచ్‌ల రైలు సెట్  రూ.65 కోట్ల చొప్పున.. రూ.650 కోట్ల వ్యయం కానుందని అంచనా వేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు ప్రస్తుతం ఉన్న 57 రేక్‌లకు అదనపు కోచ్‌లను జత చేసి రైళ్ల సామర్థ్యం పెంచేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.   

‘మేక్ ఇన్ ఇండియా’పై ఫోకస్

హైదరాబాద్ నగరంలో ఉద్యోగ, విద్య, వ్యాపార అవకాశాలతో పాటు ఐటీ కారిడార్లు రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. దీంతో మెట్రో రైళ్లలో రద్దీ పెరుగుతోంది. రోజుకు 4.6 లక్షల మంది ప్రయాణిస్తున్న పరిస్థితిలో రాబోయే రోజుల్లో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అందుకే కొత్త కోచ్‌లను తీసుకురావడం ద్వారా ప్రస్తుత రైళ్లలోనే అదనపు ప్రయాణికులను తరలించాలన్నది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం మూడు కోచ్‌లతో నడుస్తున్న ప్రతి రైలుకు ఒక అదనపు కోచ్ జత చేస్తే నాలుగు కోచ్ల రైళ్లు అందుబాటులోకి వస్తాయి. అంటే ఒక్కో రైలు రవాణా సామర్థ్యంలో గణనీయమైన పెరుగుదల వస్తుంది. కొత్త కోచ్‌లను 8 నుంచి 10 నెలల్లో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కొత్త కోచ్‌లను ప్రస్తుతం ఉన్న సాంకేతిక వ్యవస్థతో అనుసంధానం అయ్యేలా రూపొందించాల్సి ఉంటుంది.