18 June, 2026 | 1:38 AM

మోడల్ స్కూల్

18-06-2026 12:00 AM

పదేళ్లయినా తొలగని కష్టాలు

తాగునీటికి తిప్పలు 

వంటకు తంటా

హాస్టల్ నిర్వహణ‘లో’పం

కేసముద్రం, జూన్ 17 (విజయక్రాంతి): కేసముద్రం మండలం కల్వల గ్రామంలో 2015లో ఆదర్శ (మోడల్) పాఠశాలను ఏర్పాటుచేసి పదేళ్ల దాటినా నేటికీ పాఠశాలలో వంటశాల, డైనింగ్ హాల్ నిర్మాణం చేపట్టలేదు. అలాగే వందమంది విద్యార్థినులకు హాస్టల్ వసతి సక్రమంగా నిర్వహించడం లేదు. పాఠశాలలో ఐదు నుంచి 10వ తరగతి వరకు రెండు సెక్షన్ల  చొప్పున కలిపి 500 మంది విద్యార్థులకు అవసరమైన తాగునీటి వసతి, దైనందిన అవసరాల కోసం నీటి సౌకర్యం సక్రమంగా లేదు.

దీనికి తోడు ఇంటర్మీడియట్ కళాశాల కూడా ఏర్పాటు చేశారు. కళాశాలకు సంబంధించి విద్యార్థులకు కూడా సరైన వసతులు లేవు. దీనితో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. తాగునీటి అవసరాలను తీర్చుకోవడానికి ఇంటినుండే బాటిళ్లలో మంచినీళ్లు తెచ్చుకుంటున్నారు. మిషన్ భగీరథ నీటి పైనే ఆధారపడి మధ్యాహ్న భోజనం వండుతున్నారు.

దైనందిన అవసరాలకు కూడా వాటినే వినియోగిస్తున్నారు. భగీరథ నీటి సరఫరా లో ఏదైనా ఇబ్బంది కలిగితే గ్రామపంచాయతీ ట్యాంకర్ ద్వారా నీటిని తెప్పిస్తున్నారు. నీటి సమస్య తీర్చడానికి అనేక పర్యాయాలు ప్రజా ప్రతినిధులకు, అధికారులకు విజ్ఞప్తి చేసిన ఇప్పటివరకు సరైన స్పందన లేదని చెబుతున్నారు. ఇక డైనింగ్ హాల్ నిర్మాణం, వంటశాల నిర్మాణం చేపట్టడానికి నిధులు మంజూరు చేసినప్పటికీ నిర్మించడానికి ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో నిధులు వెనక్కి పోయాయి.

దీనితో వంట వండి పెట్టే మహిళలు వర్షాకాలంలో ఇబ్బంది తలెత్తకుండా కొంత ఖర్చులతో టార్పాలిన్ తో తాత్కాలిక షెడ్డు వేసుకొని చెట్ల కింద వంట నిర్వహిస్తున్నారు. గత రెండేళ్ల క్రితం కిచెన్ షెడ్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసి ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ స్వయంగా పనులను ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు అతిగతి లేదని ఆరోపిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలకు అవసరమైన కిచెన్ షెడ్, డైనింగ్ హాల్ నిర్మించాలని, తాగునీటి ఎద్దడి నివారణకు శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని కోరుతున్నారు.

హాస్టల్ నిర్వహణ అస్తవ్యస్తం

మోడల్ స్కూల్లో విద్యను అభ్యసిస్తున్న దూరప్రాంతాలకు చెందిన బాలికల కోసం మోడల్ స్కూల్ ఆవరణలో ప్రత్యేకంగా హాస్టల్ నిర్మించారు. దూర ప్రాంతాల నుండి వచ్చే బాలికలను వంద మందిని ఎంపిక చేసి వారికి హాస్టల్లో భోజన వసతి కల్పించాల్సి ఉంటుంది. అయితే గత నాలుగేళ్లుగా హాస్టల్ నిర్వహణ సరిగా లేదు. హాస్టల్ నిర్వాణ బాధ్యతలను చూడడానికి కేర్ టేకర్, హెడ్ కుక్, ఇద్దరు సహాయకులు, ఆరోగ్య అవసరాలను తీర్చడానికి ఏఎన్‌ఎం పోస్టులను భర్తీ చేయకపోవడంతో తాత్కాలిక నియామకాల ద్వారా హాస్టల్ నిర్వహిస్తున్నారు.

దీనితో తరచుగా వేతనాల చెల్లింపు జాప్యం కావడంతో విధులు సక్రమంగా నిర్వహించకపోవడం, నిర్వహణ బాధ్యతలు సరిగా నిర్వర్తించకపోవడం, వంటకు కావాల్సిన సామగ్రి, ఇతర వసతులను సరిగా చేపట్టకపోవడంతో హాస్టల్ తరుచుగా మూతపడుతోందని, బాలికలకు అసౌకర్యంగా మారిందని చెబుతున్నారు. హాస్టల్ నిర్వాహన బాధ్యతల కోసం రెగ్యులర్ కేర్ టేకర్ ను, రెగ్యులర్ వంట మనుషులను నియమించాలని, మధ్యలో బ్రేక్ ఇవ్వకుండా విద్యా సంవత్సరం పూర్తయ్యేంతవరకు హాస్టల్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అధికారుల దృష్టికి తీసుకువెళ్లా..

మోడల్ స్కూల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చాను. కిచెన్ షెడ్, డైనింగ్ హాల్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు ఇచ్చాము. గ్రామపంచాయతీ సహకారంతో తాత్కాలికంగా నీటి అవసరాలు తీరుతున్నాయి. శాశ్వతంగా నీటి ఎద్దడి నివారణ కోసం చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశాం. హాస్టల్ నిర్వాహన కోసం రెగ్యులర్ పోస్టుల నియామకం కోసం అధి కారులను కోరాం. పాఠశాలలో తాగునీ టి అవసరాల కోసం పదివేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ ఏడాది పాఠశాలలో అసౌకర్యాల తొలగింపు కోసం కృషి చేస్తున్నాం. 

నవీన్, ప్రిన్సిపాల్, 

కలవల మోడల్ స్కూల్