2 June, 2026 | 1:25 AM

సీతారామ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి

02-06-2026 12:54 AM

మరేళ్లపాడు అదనపు పంప్‌హౌస్‌ను సందర్శించిన మంత్రి 

కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

అశ్వాపురం, జూన్ 1, (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిని పరిశీలించేందుకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మారేళ్లపాడు అదనపు పంప్హౌస్ను సందర్శించారు.

ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పంప్హౌస్ నిర్మాణ పనులు, మోటార్ల ఏర్పాటు, విద్యుత్ వ్యవస్థలు, నీటి ఎత్తిపోతల సామర్థ్యం, ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి, పనుల నాణ్యతలో రాజీ పడకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు తెలంగాణ రైతాంగానికి వరంగా నిలవబోతుందని, ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

మరేళ్లపాడు అదనపు పంప్హౌస్ సీతారామ ప్రాజెక్టులో కీలక భాగమని, దీని ద్వారా నీటి సరఫరా మరింత సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నాయకత్వంలో సాగునీటి రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇంజినీర్లు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.