calender_icon.png 14 February, 2026 | 7:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలను పరిష్కరించేందుకు కృషి

14-02-2026 01:10:33 AM

తుంగతుర్తి ఫిబ్రవరి 13: గొట్టిపర్తి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించుటకు రాజకీయాలకతీతంగా కృషి చేస్తామని సర్పంచ్ చిలుకల వెంకన్న మంజుల అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో మొదటి గ్రామసభ నిర్వహించి ,సమస్యలను వార్డు సభ్యులు, ప్రజల నుండి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు వార్డు సభ్యులు మాట్లాడుతూ గత కొన్ని నెలల నుండి వీధుల్లో వీధిలైట్లు లేక ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో గ్రామంలోని వీధుల్లో కోతుల బీభత్సం నిర్వహిస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాయని తక్షణమే రాజకీయాలకతీతంగా గ్రామస్తులంత కలిసి కోతుల నిర్మూలనకు కృషి చేయాలని కోరారు. అలాగే వీధి కుక్కలు భయంకరమైన రోగాలతో సతమతమవుతున్నాయని, కుక్కల రోగాలు నిర్మూలనకు కృషి చేయాలని కోరారు.

పాఠశాల ఆవరణలో గేటు లేకపోవడంతో, యువత ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని పలు ఉపాధ్యాయులు, గ్రామస్తులు కోరారు. ప్రస్తుతం గ్రామపంచాయతీ సుమారు 5 లక్షల రూపాయల నిధులు వచ్చినట్లు సర్పంచ్ తెలిపారు. కార్యవర్గం ఆదేశాల మేరకు అభివృద్ధి పనులు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శేఖర్, ఉప సర్పంచ్ అన్న బోయిన శ్రీకాంత్ కేతిరెడ్డి రవీందర్ రెడ్డి ,కేతిరెడ్డి లతా రెడ్డి గుమ్మడవెల్లి సోమన్న, వార్డు సభ్యులు అరుణ, రజిత, ఐలమ్మ ,పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.